బషీరాబాద్, జూలై 8 : జీవన్గి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాడు అన్నం వడ్డించారంటూ వివిధ పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా విద్యాధికారి అబ్దుల్ఘనీ సీరియస్గా స్పందించి, మండల విద్యాధికారి దుస్సా రాములును విచారణకు ఆదేశించారు. పాఠశాలకు వెళ్లిన ఎంఈవో ముందుగా ప్రధానోపాధ్యాయుడు శంకరయ్యకు విద్యాధికారి జారీ చేసిన మెమోను అందించారు. అనంతరం మాడు అన్నం, ప్రత్యేక వంటకాలు, పుట్టిన రోజు వేడుకలు, ఫొటోలు తీయొద్దన్న విషయాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో విడివిడిగా నాలుగు గంటలపాటు విచారణ జరిపారు.
మాడు అన్నం విషయంలో విద్యార్థులను ప్రశ్నించినప్పుడు కొంతమంది విద్యార్థులు వద్దన్నా అలాగే వడ్డించారని, మరికొంత మంది విద్యార్థులు ఇష్టంతోనే వడ్డించుకున్నట్లు విద్యార్థులు తెలిపినట్లు ఎంఈవో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో ఎంఈవో మాట్లాడుతూ.. మాడిన అన్నాన్ని విద్యార్థులకు ఎలా వడ్డిస్తారు. చిన్నపిల్లలు వారికి ఏమి తెలుసు, వారు ఏది వడ్డించమంటే అది వడ్డిస్తారా వారి ఆరోగ్యంతో ఆటలాడుతారా అన్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులను విచారించే సమయంలో అన్ని తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తెలిసింది. పుట్టి న రోజు వేడుకలపై ఎంఈ వో ఉపాధ్యాయులను అడుగగా.. ప్రధానోపాధ్యాయు డు శంకరయ్య పుట్టిన రోజుతోపాటు విద్యార్థి అక్షర పుట్టిన రోజు ఉండటంతో వేడుకలను నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపినట్లు విద్యాధికారి వివరించారు.
అందు కోసమే కేక్ తెప్పించి ప్రత్యేక వంటకాలు చేశామని కూడా చెప్పారని ఎంఈవో తెలిపారు. విద్యార్థి కోసం కేక్ తెప్పించలేదని, ప్రధానోపాధ్యాయుడి కోసమే అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కేక్ తెప్పించినట్లు కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రత్యేక వంటకాలు, ఫొటో తీయొద్దన్న విషయాలపై ఉపాధ్యాయులు ఏమీ మాట్లాడలేదని తెలిపారు. జిల్లా విద్యాధికారి ఫోన్లో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహించినట్లు తెలిసింది. పేపర్లలో వార్త రాగానే అధికారులు స్పందించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ‘మీడియా మా గొంతుగా మారింది. ఇకనైనా మా పిల్లలకు మంచి భోజనం పెడతారని ఆశిస్తున్నాం’ అన్నారు. కాగా ఎంఈవో ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. వివిధ పేపర్లలో కథనాలు రావడంతో విద్యార్థులకు నాణ్యమై మధ్యాహ్న భోజనం, సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.