షాద్‌నగర్ టౌన్, నవంబర్ 1: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తున్నది. ఒకే ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చేపలు తదితర వస్తువులు లభ్యమయ్యేలా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ ఆవరణ లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్‌ను రూ. 4.50కోట్లతో నిర్మిస్తున్నది. అత్యాధునిక హంగులతో అం దుబాటులోకి రానున్న ఈ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఇటీవల శంకుస్థాపన చేయ గా పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూరగాయల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఒకే చోట లభ్యం కానుండటంతో సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 4.50 కోట్లతో మోడల్ మార్కెట్
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ ఆవరణలో రూ. 4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 18 దుకాణాలను నిర్మించి అం దులో కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చేపలను విక్రయించనున్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు అనువుగా పార్కింగ్ సౌకర్యం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులను కల్పించనున్నారు.
ఈ మార్కెట్లో నాణ్యమైన వస్తువులతోపాటు ధరలు కూడ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. మోడల్ మార్కెట్, వంద పడకల దవాఖాన, రైల్వే వంతెన, పాత జాతీయ రహదారి విస్తరణ పనులతోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ భవనం, గ్రంథాలయాల నిర్మాణాలతో షాద్‌నగర్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది.
సమయం ఆదా అవుతుంది
ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, మాంసం, ఇతర వస్తువులన్నీ ఒకేచోట దొరకడం ద్వారా సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా నాణ్యమైన వస్తువులు కూడా లభిస్తాయి.
-ఆకుల రవికుమార్, వ్యాపారి షాద్‌నగర్
అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
షాద్‌నగర్ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వార్డుల్లో మిషన్ భగీరథ నల్లాలను ఏర్పాటు చేసిన ఇంటింటికీ తాగునీటిని అం దించడంతోపాటు సీసీ రోడ్లను కూడా ఏర్పా టు చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధం గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మోడల్ మార్కెట్ ఏర్పాటుతో మున్సిపాలిటీ ఆదర్శంగా మారనున్నది.
-కొందూటి నరేందర్, మున్సిపల్ చైర్మన్ షాద్‌నగర్
ప్రజలకు ఎంతో ఉపయోగకరం
షాద్‌నగర్ మున్సిపాలిటీలో మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తైతే ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కూరగాయలు, ఇతర వస్తువులు అన్ని ఒకే దగ్గర అందుబాటులో ఉంటా యి. నాణ్యమైనవి లభిస్తాయి. -అనితాక్షీరసాగర్, గృహిణి షాద్‌నగర్