రంగారెడ్డి, మే 16(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను వెబ్ కాస్టింగ్ స్రీనింగ్ ద్వారా కలెక్టర్ శశాంక గురువారం పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ముగిసిన అనంతరం మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ యంత్రాలను బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో భద్రపర్చారు.
వీటిని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక ఒకో స్ట్రాంగ్ రూంను వెబ్ కాస్టింగ్ స్రీనింగ్ ద్వారా పరిశీలించారు. వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలు, వాటి పరిసరాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గమనించారు. నిరంతరం నిఘా కోసం అమర్చిన క్లోజ్డ్ సర్యూట్ కెమెరాల పనితీరు, వాటి ద్వారా కొనసాగిస్తున్న పర్యవేక్షణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట చేవెళ్ల ఆర్డీఓ సాయిరామ్, కందుకూర్ ఆర్డీఓ సూరజ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.