తుర్కయాంజాల్, జూలై 8 : ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వ భూముల కబ్జాలపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారని, దోచుకో.. దోచింది దాచుకో అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆదిబట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ మునగనూర్ రెవెన్యూ పరిధి సర్వే నం.44లో కబ్జాకు గురైన సుమారు రూ.200 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మునగనూర్ రెవెన్యూ సర్వే నం.44లోని 40 ఎకరాల భూమి 70 సంవత్సరాలుగా సర్కారు భూమిగా ఉన్నది.
ఈ భూమిలో 22 ఎకరాల భూమిని 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొంతమందికి అసైన్డ్ చేశారు. మిగిలిన 18 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి.. సర్కారు భూమిగా బోర్డును సైతం ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాలపాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ భూమిని కబ్జా చేయడానికి ఎవరు కూడా సాహసించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ భూమిని కబ్జా చేయాలని కాసుకొని కూర్చున్న నాయకులు.. 2024లో సర్వే నం.44లోని భూమిని డివైడ్ చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే సర్వే నంబర్‌కు పలు సర్వే నంబర్లు వేశారు.
సర్వే నం44/1లోని భూమిని 44/7, 44/8, 44/10, 44/11గా చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్లను ఓ మహిళ పేరుపై చేసి వారంలోపే మరొకరి(గోపాల్) పేరుపై చేసుకున్నారు. అనంతరం నాలా కోసం ఐప్లె చేశారని తెలిపారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ల కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి పేర్లు మార్చారని పేర్కొన్నారు. దీంతోపాటు ఓ వ్యక్తి 2 ఎకరాలకు పైగా స్థలాన్ని కబ్జా చేసినట్లు చెప్పారు. గతంలో ఈ భూమిని రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలంగా బోర్డును ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా మినీ స్టేడియం, పార్క్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. సర్కారు భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి. ఈ కబ్జాలకు అధికారులు మద్దతిస్తే భవిష్యత్‌లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ప్రజల భూములను కబ్జా చేస్తే ప్రజ లు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.
భూమిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
మునగనూర్‌లోని సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని రక్షించాల్సిన బాధ్యత సర్కారు, కలెక్టర్‌పై ఉందని.. సర్వే నం.44లోని కబ్జాలను తొలగించి ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంచిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని ప్రజలు ఉపయోగించుకునేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమికి ఆస్తి మార్పిడి జరగడం సరికాదని, దీని వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదన్నారు. ఈ భూమిని ప్రజాప్రయోజనార్థం ఉపయోగించుకోవాలని సూచించారు. సర్కారు భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ కౌన్సిలర్ కల్యాణ్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు ప్రభువర్ధన్‌రెడ్డి, అశోక్, చిన్నయ్య, గౌతమ్‌రెడ్డి, రంగారెడ్డి, ఆనంద్‌రెడ్డి, మోహన్, వెంకట్‌రెడ్డి, సంపతీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
సర్వే నం.44 పరిశీలన
మునగనూర్ సర్వే నం.44లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ యువ మోర్చా రాష్ట్ర నాయకుడు నోముల కార్తీక్గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూర మాట్లాడుతూ.. రూ.200 కోట్ల భూమిని కబ్జా చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేతల పాత్ర ఉందన్నారు.70 సంవత్సరాలుగా సర్కారు భూమిగా ఉన్న స్థలాన్ని అధికారం ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలు అస్తి మార్పిడి చేశారని తెలిపారు.రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుండగా.. ఇబ్రహీంపట్నం ఆర్ఆర్ఆర్(3ఆర్) ట్యాక్స్ నడుస్తున్నదని పేర్కొన్నా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని కాపాడాలని కోరారు.కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్, తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు ప్రేమ్‌సాయి పాల్గొన్నారు.