బొంరాస్‌పేట, అక్టోబర్ 10 : మండలంలోని తుంకిమెట్లలో మంగళవారం ఉదయం పోలీసులు రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా మంగళవారం ఉదయం బొంరాస్‌పేట ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు తుంకిమెట్లలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. కులకచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన శివరాములు తాండూరు నుంచి కారులో వస్తుండగా పోలీసులు తనిఖీలు చేయగా, వాహనంలో ఉన్న రూ.2 లక్షల నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. సమాచారాన్ని సీఐ రాములుకు అందించగా ఆయన బొంరాస్‌పేటకు వచ్చి నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో రూ.6.50లక్షలు స్వాధీనం..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంచాల రోడ్డులో భారత్‌గార్డెన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక ఆటోలో ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లవైపు తీసుకెళుతున్న రూ.6.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన నగదును ఐటీశాఖకు పంపిస్తామని, సీఐ గోవింద్‌రెడ్డి తెలిపారు. ఇకనుంచి వాహనాల తనిఖీని మరింత విస్తృతం చేస్తామని, అక్రమంగా డబ్బు తరలిస్తే స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఎన్నికల నియామవళికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలన్నారు.
చేవెళ్లలో పోలీసుల తనిఖీ..
చేవెళ్లటౌన్ : ఎన్నికల కోడ్ అములులోకి వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులు ఆయా చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తుండంతో నగదు పట్టుబడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని అంతారం గ్రామ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనీఖీ చేస్తుండగా తాండూరుకు చెందిన బాను చందర్ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. కారును తనిఖీ చేయడంతో రూ. 2లక్షల 20వేలు పట్టుబడింది. నగదును చేవెళ్ల తహసిల్దార్ కృష్ణయ్య సమక్షంలో సీజ్ చేసి చేవెళ్ల మండల కేంద్రంలోని సబ్ ట్రెజరీ శాఖలో డిపాజిట్ చేశామని చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
రూ.5 లక్షలు
మోమిన్‌పేట : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మండలంలో పలు చోట్ల పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. సొమవారం రాత్రి ఎన్కతల గ్రామం ఆర్కతల రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించగా నగేష్, కృష్ణ కారులో రూ.5 లక్షలతో ప్రయాణిస్తుండగా, ఆ డబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్సై విఠల్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
రూ.9.50లక్షలు పట్టివేత
వికారాబాద్ : పట్టణంలోని ఎన్టీఆర్చౌరస్తాలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో రూ.9.50లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిత్ తన కారులో తాండూరుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ సీఐ టంగూటూరి శ్రీను పంచనామా చేసి వికారాబాద్ తహసీల్దార్‌కు అప్పగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ.50వేలకు పైగా నగదు తరలిస్తే స్వాధీనం చేసుకుంటామన్నారు. సరైన ఆధారాలు చూపించి డబ్బులను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.బెల్టు షాపుపై దాడి.. మద్యం స్వాధీనం
ఆదిబట్ల : బెల్టు షాపుపై దాడి చేసి అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై ఎం శ్రీనివాసరావు తెలిపారు. నాదర్గుల్ గ్రామంలో చమన్ వెంకటేశ్ తన ఇంటి ఎదుట ఎలాంటి అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారంతో దాడి చేశామని చెప్పారు. వివిధ రకాల 156 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, వెంకటేశ్‌ను ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుపరిచినట్టు తెలిపారు. ఆయన వెంట సిబ్బంది గిరిబాబు, శివచంద్ర ఉన్నారు.