వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనులంటూ భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములిచ్చేది లేదని దాదాపు ఏడాదిపాటు ఉద్యమించినా పోలీసులతో బెదిరింపులకు పాల్పడి కేసులు నమోదు చేయించి అన్నదాతలను జైలుకు పంపించి బలవంతంగా లాక్కున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. మరోసారి జిల్లాలోని పరిగి మండల రైతుల భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరిట గుంజుకునేందుకు యత్నాలను షురూ చేసింది.
పరిగి మండలంలోని కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ రెండు గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములను కూడా సేకరించాలని భావించడంతో సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న భూములను ఇండస్ట్రియల్ పార్కును ఇచ్చేది లేదని నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచీ తేల్చి చెబుతూ నే ఉన్నారు. అంతేకాకుండా ప్రాణాలైనా ఇస్తాం కానీ జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటున్నారు. బేషరతుగా ఆ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భూములను తీసుకుంటే తమ బతుకులు ఆగం అవుతాయని.. పొట్ట కూటికోసం ఇతర ప్రాం తాలకు వలస వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి సీఎంతోపాటు పరిగి ఎమ్మెల్యేగా రామ్మోహన్‌రెడ్డిని గెలిపిస్తే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేదల బాగు కోసం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇచ్చిన భూములను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల నుంచి లాక్కుంటుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలోని 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా విడతల వారీగా భూసేకరణ చేసేలా ముందుకెళ్తున్నది. ప్రస్తుతం కాళ్లపూర్లోని 428 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా రెవెన్యూ అధికారులకు భూముల సర్వేకు అనుమతులివ్వడంతోపాటు భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారికి సమర్పించాలని సూచించింది. అయితే 1,197 ఎకరాల్లో కాళ్లపూర్లో అసైన్డ్ భూములు-428.05 ఎకరాలు, పట్టా భూములు 159.25 ఎకరాలు, రాపోల్ గ్రామానికి సంబంధించి అసైన్డ్ భూములు 509 ఎకరాలుకాగా, 101.08 ఎకరాల పట్టా భూములను ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం సేకరించాలని నిర్ణయించారు.
ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేదిలేదు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో పేదలకు వారు భూములను ఇచ్చారు. ఆ భూములను బడా పారిశ్రామికవేత్తల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కునేందుకు చూస్తున్నది. మా గ్రామంలోని 200-300 మంది పేద రైతులకు ఇచ్చిన బీడు భూములను వారు సాగు చేసుకుని కొన్నేండ్లుగా వాటి ఆధారంగా బతుకుతున్నారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. – రవి సాగర్, రాపోల్