రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాలు అందడంలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పంచాయితీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అందడం లేదని కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత వర్గాల మధ్య పంచాయితీ షురూ అయింది.
ముఖ్యంగా జిల్లాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీలో ఉన్న నాయకులు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకుల మధ్య ఈ ప్రచ్చన్న పోరు జరుగుతున్నది. మాడ్గుల మండలంలో బుధవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఓవైపు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుండగానే.. మరోవైపు కొత్తగా పార్టీలో చేరిన కొండల్‌రెడ్డి వర్గానికి చెందిన మిద్దె రాములు, పాత కాంగ్రెస్‌కు చెందిన రాంరెడ్డి వర్గానికి చెందిన రాములు మధ్య ఇందిరమ్మ ఇండ్ల కోసం పంచాయితీ జరిగింది.
ఈ పంచాయితీ జరుగుతుండగానే ఎమ్మెల్యే మరో కార్యక్రమం ఉందని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తమ వర్గానికి ఇళ్లు రాకుండా పాత కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని, మాడ్గులకు 40 ఇండ్లు వస్తే పాత వర్గం వారికే వచ్చాయని, తాము కొండల్‌రెడ్డి వర్గంలో ఉండటం వలన తమకు ఇండ్లు రాలేదని మిద్దె రాములు ఆరోపించారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పంచాయితీ తీవ్రతరమైంది. ఒకనొక దశలో బాహాబాహికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చామని, తామిచ్చిన పేర్లను లిస్టులో రాకుండా చేయడం సమంజసం కాదని మాజీ ఉపసర్పంచ్ రాములు వాపోతున్నారు. కొత్త, పాత తేడా లేకుండా అందరికీ అందేలా చూడాలని కోరుతున్నారు.
జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మండల, మున్సిపాలిటీల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను కొత్తవారిని నియమించాలని అ ధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా లో పార్టీ పదవుల కోసం కొత్త, పాత నాయకుల మధ్య పంచాయితీ ప్రారంభమైంది. అధ్యక్ష పదవులు దక్కించుకోవడం కోసం పార్టీ నాయకుల మధ్య పోటీ తీవ్రమైంది. బీఆర్ఎస్ పార్టీని కాదని, కాంగ్రెస్‌లో చేరినవారికి చేరికలకు ముందు పలు హామీలిచ్చారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పిస్తామని చేర్చుకున్నారు.
కాని, పార్టీలో చేరిన తర్వాత తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు అడిగినా ఎవరూ చెవిన పెట్టడం లేదని వాపోతున్నారు. కొత్త, పాత పంచాయితీల మధ్యనే పార్టీ అధ్యక్ష పదవుల నియామకం వాయిదా పడింది. జిల్లా పరిధిలో అత్యధికంగా ఉన్న మున్సిపాలిటీలు, రూరల్ మండలాల అధ్యక్ష పదవులతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులు కూడా భర్తీ చేయడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. దీంతో పదవుల భర్తీ చేపడితే గ్రూపులు మరింత పెరిగే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు పదవుల ఎంపికను వాయిదా వేస్తూ వస్తున్నారు.
జిల్లాలోని గ్రామీణ మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాతల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం ఇవ్వడంలేదని, ప్రభుత్వ పథకాలు కూడా అందడంలేదని వాపోతున్నారు. చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినవారు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గ పూర్తిస్థాయి అధికారాలను ఎమ్మెల్యేలే తీసుకున్నారు.
దీంతో తమతో పాటు పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారని, తాము ఎంతోకాలంగా పార్టీలో ఉన్న తమకు మాత్రం రావడంలేదని సోషల్ మీడియా వేదికగా పాత కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా తాము పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమకు న్యాయం జరుగడంలేదని వాపోతున్నారు. గ్రామీణ మండలాల్లో సైతం కొత్త, పాత వర్గాల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉన్నది. ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత వివిధ పార్టీల్లో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలు వచ్చారు కాని, కాంగ్రెస్‌లో చేరిన వారిని ఎవరూ పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు.
జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికల తర్వాత చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పార్టీ పదవులను ఆయా ఎమ్మెల్యేలు నియమించనున్నారు.
మహేశ్వరం ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ఆయా మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్షులను నియమిస్తారు. కాని, ఈ నియోజకవర్గాల్లో పాతవారికి పదవులు దక్కుతాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు తమ వెంట పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చే అవకాశాలున్నాయని, పాతవారు భావిస్తున్నారు. దీంతో మండలాలతోపాటు మున్సిపాలిటీల్లో భూ తగాదాలు బయటపడే అవకాశాలున్నాయి.