వికారాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 8.46 శాతం మేర పోలింగ్ శాతం పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 60.49 శాతం మేర పోలింగ్ శాతం నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 68.95 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో 11 శాతం మేర పోలింగ్ పెరగడం గమనార్హం.
వికారాబాద్ నియోజకవర్గంలోనూ దాదాపు 10 శాతం, పరిగి నియోజకవర్గంలో 6.04 శాతం, తాండూరు నియోజకవర్గంలో 8.33 శాతం మేర పోలింగ్ పెరిగింది. 2019 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో 60.97 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 71.04 శాతం మేర, వికారాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 61.03 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 70.44 శాతం, పరిగి నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 60.97 శాతం మేర పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 67.01 శాతం, తాండూరు నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 59 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 67.33 శాతం మేర పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే మహిళా ఓటర్లు కూడా చైతన్యం ప్రదర్శించడం గమనార్హం.
పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 9,83,191 ఓట్లుండగా, 6,77,336 ఓట్లు పోలయ్యాయి. వీరిలో పురుషులు 4,85,210 ఓట్లుండగా.. 3,39,631 ఓట్లు, మహిళా ఓట్లు- 4,97,946 ఓట్లుండగా.. 3,37,685 ఓట్లు, ఇతరుల ఓట్లు 35 ఓట్లుండగా.. 20 ఓట్లు పోలయ్యాయి. పరిగి నియోజకవర్గంలో 2,66,566 మంది ఓటర్లుండగా పురుషులు 1,33,568 మంది, మహిళలు 1,32,989 మంది ఓటర్లు, ఇతరులు 9 మంది ఓటర్లు ఉన్నారు.
పరిగి నియోజకవర్గంలో మొత్తం 1,78,663 ఓట్లు పోలుకాగా, వీరిలో పురుషులు-90,155 ఓట్లు, మహిళలు-88,480 ఓట్లు, ఇతరులు-9 ఓట్లు పోలయ్యాయి. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,639 మంది ఓటర్లుండగా పురుషులు 1,14,965 మంది ఓటర్లు, మహిళలు 1,16,660 మంది ఓటర్లు, ఇతరులు 14 మంది ఓటర్లుండగా, పోలైన ఓట్లకు సంబంధించి వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 1,63,167 ఓట్లు పోలుకాగా, వీరిలో పురుషులు-82,604 ఓట్లు, మహిళలు-80,556 ఓట్లు, ఇతరులు-7 ఓట్లు పోలయ్యాయి.
తాండూరు నియోజకవర్గంలో 2,43,192 మంది ఓటర్లుండగా, పురుషులు 1,17,821 మంది ఓటర్లు, మహిళలు 1,25,364 మంది ఓటర్లు, ఇతరులు ఏడుగురు ఉండగా, పోలైన ఓట్లకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో మొత్తం 1,63,749 ఓట్లు పోలుకాగా, వీరిలో పురుషులు-81,317 ఓట్లు, మహిళలు-82,429 ఓట్లు, ఇతరులు-3 ఓట్లు పోలయ్యాయి. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,41,794 మంది ఓటర్లుండగా, పురుషులు 1,18,856 మంది, మహిళలు 1,22,933 మంది ఓటర్లు, ఇతరులు ఐదుగురు ఓటర్లు ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 1,71,776 ఓట్లు పోలుకాగా, వీరిలో పురుషులు 85555 ఓట్లు, మహిళా ఓట్లు 86,220 ఓట్లు, ఇతరులు-1 ఓట్లు పోలయ్యాయి.
జిల్లాలోని మహిళా ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జిల్లాలో మహిళా ఓటర్లే ఆధిక్యత ప్రదర్శించారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయినంత వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూ ఉన్నప్పటికీ ఓపికతో మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం మహిళా ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు ఊరూరా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాన్నిచ్చాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 3,37,685 మహిళా ఓట్లు పోలయ్యాయి. తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓట్లే అధికంగా పోలు కావడం గమనార్హం. పరిగి నియోజకవర్గంలో 88,480 మహిళా ఓట్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 80556 మహిళా ఓట్లు, తాండూరు నియోజకవర్గంలో 82,429 మహిళా ఓట్లు, కొడంగల్ నియోజకవర్గంలో 86,220 మహిళా ఓట్లు పోలయ్యాయి.