మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ‘రైతుభరోసా’ డబ్బులు పడతాయన్నారు.. ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్లు తెచ్చింది రైతుభరోసా పథకం కోసమేనని నమ్మబలికారు.. కానీ, రోజులు గడుస్తున్నాయి తప్ప కాంగ్రెస్ సర్కార్ ఆ ముచ్చటే ఎత్తడం లేదు. రైతుభరోసా డబ్బుల కోసం రైతులు కళ్లల్లో ఒత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. రైతుభరోసా పథకాన్ని కరెక్టుగా వ్యవసాయ సీజన్‌కు అనుగుణంగా ఇస్తే ఇప్పటికే ఐదు దఫాలుగా అందించాలి. కానీ, ఒక్కటంటే ఒక్కసారీ సరిగ్గా ఇచ్చింది లేదు. గత యాసంగి రైతుభరోసా సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టింది. గతేడాది వానకాలం సీజన్ రైతుభరోసాను నాలుగు ఎకరాలకే పరిమితం చేసింది. మరి ఈ ఏడాదైనా పూర్తిగా రైతులందరికీ పథకం వర్తించేనా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
– ఖమ్మం, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వానకాలం(2024 సంవత్సరం) పెట్టుబడి సాయంతోపాటు గతేడాది యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్ రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు చేరినప్పుడు హమ్మయ్యా..! అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ సీజన్‌కు.. ఆ సీజన్ ఠంఛన్‌గా ‘రైతుబంధు’ డబ్బులు ఖాతాల్లో జమయ్యేవనే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌పై నమ్మకమే లేకుండాపోయిందని అన్నదాతలు ఈసడించుకుంటున్నారు.
వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే నాటికే ‘రైతుభరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని గతేడాది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. కానీ, అవి మాటలకే పరిమితమయ్యాయే తప్ప అమలుకు ఏమాత్రం నోచుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ సీజన్ డబ్బులు రైతుల ఖాతాలకు చేరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌కు ఖమ్మం జిల్లాలోని 3,51,592 మంది రైతులకు గానూ రూ.440 కోట్లు, గత ఏడాది యాసంగిలో ఉన్న పెండింగ్‌లో ఉన్న 62,561 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.179 కోట్లతో కలిపి ఖమ్మం జిల్లాకు రూ.630 కోట్లు అవసరం ఉంటుంది.
కానీ, ఈ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతుభరోసా డబ్బులు ఇస్తారనే గ్యారెంటీనే లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. వీటికితోడు కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతుభరోసా డబ్బులు ఈ వానకాలం సీజన్లో జమైతే ఈ మొత్తంలో జిల్లాకు రావాల్సిన మొత్తం పెరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి నెల సగం పూర్తికాగా కొన్నిచోట్ల మొక్కజొన్న చేతికందే దశకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా రైతుభరోసా అందించి తమకు అండగా నిలవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఏడాదికి రూ.6 వేలే ఇస్తున్నారు..
కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుభరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.. కానీ, అమలు చేయడం లేదు. కేవలం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు.. అది కూడా రెండు సీజన్లకు ఇవ్వడం లేదు. ఒక్క సీజన్‌కు మాత్రమే రూ.6 వేలు ఇస్తున్నారు. 2024 వానకాలం సీజన్లో అనర్హుల ఏరివేత పేరుతో కాలయాపన చేసింది. ఆ ఏడాది యాసంగి సీజన్ డబ్బులకు పూర్తిగా ఎగనామం పెట్టింది.
కాంగ్రెస్‌పై నమ్మకం పోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు పడ్తయనే నమ్మకం పోయింది. ఓ ఏడాది యాసంగి సీజన్ డబ్బులను ఎగ్గొట్టింది. గత ఏడాది వానకాలం సీజన్ డబ్బులను నాలుగెకరాలలోపు రైతులకు మాత్రమే జమ చేసింది. రైతులను విస్మరించిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. ప్రతి సీజన్‌కు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా డబ్బులు క్రమం తప్పకుండా వేయాలి.
– షేక్ మీరా, రైతు, చిమ్మపూడి, రఘునాథపాలెం
పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది..
నాకు 1.36 ఎకరాల భూమి ఉంది.. గత ఏడాది వానకాలం సీజన్లో రూ.11,400 పడ్డాయి. యాసంగి సీజన్‌కు పూర్తిగా డబ్బులు పడలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి సీజన్‌కు పెట్టుబడి సాయం రైతుబంధు కింద అందించేవారు. ఇప్పుడు వస్తయో.. రావో గ్యారెంటీ లేకుండాపోయింది. నాడు కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చేది. నేడు రేవంత్‌రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ఇస్తున్నాడు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా.. మరి ఓట్ల కోసమైనా రైతుభరోసా డబ్బులు వేస్తాడేమోనని ఎదురుచూస్తున్నం.
– పోతురాజు సంగయ్య, రైతు, చిమ్మపూడి, రఘునాథపాలెం