హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ): నేను రాజు, నేనే మంత్రినని తనకు తాను ప్రకటించుకున్న రేవంత్‌రెడ్డి.. అటు ముఖ్యమంత్రిగా, ఇటు మున్సిపల్‌శాఖ మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ వివేకానంద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేండ్ల పాలనలో హైదరాబాద్‌లో ఏ ఒక్క అభివృద్ధి పనిచేయలేదని, నగరవాసులకు మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చీరెలు పంచడం, రివ్యూలు చేయడం మినహా ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హంగు, ఆర్భాటాలు, ప్రకటనలు తప్ప చేసిందేమీలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజావసరాలను గుర్తించడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్ల తర్వాత తానే రోడ్లపైకి వస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిలో విఫలమైన ప్రభుత్వం నగరాన్ని అశాస్త్రీయంగా విభజించి మూడు ముక్కలు చేసిందని ఆరోపించారు. మెట్రో సెకండ్ ఫేస్ విస్తరణకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఆమోదించిన మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసి నగరప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. నార్త్ హైదరాబాద్‌కు మెట్రో డిమాండ్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలే..
రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లోని ఏ ఒక్క మంత్రికి హైదరాబాద్‌పై అవగాహన లేదని వివేకానంద్ అన్నారు. మొదటి ఏడాది మూసీని సుందరీకరిస్తామని హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మౌనం వహించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. హైడ్రా పేరిట హంగామా చేయడం తప్ప సాధించిందేమీలేదని దుయ్యబట్టారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ లింక్‌రోడ్డు, ఆర్వోబీలు, స్టీల్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించారని గుర్తుచేశారు. కానీ మున్సిపల్‌శాఖను కూడా తనవద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పాలనను గాలి కొదిలి సొంత ప్రయోజనాల పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ‘నిజంగా కట్టిన ఇల్లు ఒక్కటైనా ఉంటే చూపించండి’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సవాల్ విసిరారు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను చూపుతూ కాంగ్రెస్ సర్కారు పబ్బం గడుపుతున్నదని ధ్వజమెత్తారు.