తిమ్మాపూర్, జూలై 26: ‘మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తరా..? లేదా మమ్మల్ని చావమంటరా?’ అని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బేతల్లి రాజేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి వేధిస్తున్నాడంటూ ఇటీవల పెట్రోల్ పోసుకొని బేతల్లి రాజేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఆదివారం మాజీ సర్పంచ్, రాజేందర్‌రెడ్డి భార్య సమత తన కూతురు, కొడుకుతో కలిసి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
గుండ్లపల్లిలో మురళీధర్‌రెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పాపానికి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించి ఇబ్బందులు పెడితే తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరుపెట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేస్తామని ఏసీపీ విజయ్‌కుమార్ హామీ ఇచ్చి, మూడురోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
మురళీధర్ రెడ్డితోపాటు మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే పిల్లలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తమకు జరిగిన అన్యాయం గురించి ఇప్పటికే వివరించామని తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిందితులను పట్టుకొని శిక్షించాలని కోరారు.