హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్ సర్కార్ రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. ఏటా బడ్జెట్లో ఆయా కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి విదల్చకపోవడం పరిపాటిగా మారింది. కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ రుణాలు ఇస్తామన్న హామీని విస్మరించింది. వాటి పరిధిలో ఉద్యోగ, ఉపాధి శిక్షణలను అటకెక్కించింది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం నీరుగారుతున్నది. ఎన్నికల ముందు ఆయా వర్గాలను నమ్మించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలను నట్టేట ముంచుతున్నది. అత్యంత వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, స్వయం ఉపాధికి రుణాలను అందిస్తామని ఊదరగొట్టింది. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడంతోపాటు, నిధులు కేటాయించకుండా ఉన్న కార్పొరేషన్లను నిర్వీర్యం చేసే దిశగా విధానపర నిర్ణయాలు తీసుకొంటున్నది. ప్రభుత్వం గడచిన రెండున్నరేండ్లలో కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లను ఏర్పాటుచేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ముదిరాజ్, యాదవ కురువ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక (పురగరి క్షత్రియ), లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు) సంబంధించి ఆర్యవైశ్య, రెడ్డి, ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ, ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీచేసింది. అన్ని బీసీకులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసి యువతకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా, వడ్డీలేని రుణాలను అందిస్తామని వాగ్దానం చేసింది. అదీ నెరవేరలేదు. ఇవిగాక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటుచేసిన 8 బీసీ కులాలకు చెందిన రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మీకి బోయ, కృష్ణబలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించినా ఇప్పటికీ ఉత్తర్వులే రాలేదు. పేరుకే కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది తప్ప వాటికి పూర్తిస్థాయి చైర్మన్లను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నియమించకుండా సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నదని ఆయా వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫెడరేషన్లకు పూర్తిస్థాయి ఎండీలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అందుబాటులో ఉన్న ఏడీలు, జేడీలు ఒక్కొక్కరూ రెండేసి చొప్పున ఫెడరేషన్ల బాధ్యతలను అదనంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. దీంతోనే ప్రభుత్వం పేరుకే కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది తప్ప ఆయా వర్గాల సంక్షేమం పట్టడమే లేదని తేటతెల్లమవుతున్నది.
కార్పొరేషన్లు అనేవి ఆయా లక్షిత సామాజిక వర్గాల ఆర్థిక అభ్యున్నతికి, ఉపాధి నైపుణ్య శిక్షణకు దోహదపడుతాయి. ప్రతి కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఏటా యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించుకొని ఆయా వర్గాలకు సబ్సిడీ రుణాలను అందించడం పరిపాటి. ఆయా సామాజికవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు, కులవృత్తిదారులకు నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించడం కూడా కార్పొరేషన్ విధుల్లో ఒకటి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యే దుస్థితి దాపురించింది. బడ్జెట్లో నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి ఇవ్వకపోవడం పరిపాటిగా మారింది. రాజీవ్ యువవికాసం పథకం పేరిట రుణాలను అందజేస్తామని చెప్పిన సర్కార్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర విద్రోహాన్ని తలపెట్టింది. బడ్జెట్లోనూ అందుకు సంబంధించి ఆయ ఆ కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించింది. కానీ వాటిలోనూ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. రుణాల మంజూరుకు దరఖాస్తులను స్వీకరించి ఏడాది దాటినా ఇప్పటికీ వాటికి అతీగతి లేకుండా పోయింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు, చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు పలు హామీలను గుప్పించింది. ఎస్సీల్లో మాల, మాదిగలతోపాటు మిగతా 57 కులాలకూ వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఎస్టీలకు సంత్‌సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ కార్పొరేషన్‌గా వేరు చేయాలని ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నది. 57 షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు.