హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రజల మద్దతు కోల్పోయిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకపర్వానికి తెరలేపిందని వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ దొడ్డిదారిన ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటిని పోలీసు బలగాలతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు. ఓటమి భయంతోనే ఆయనను కాంగ్రెస్ సర్కార్ అరెస్ట్ చేసిందని విరుచుకుపడ్డారు. అక్రమ అరెస్ట్లు, కేసులు, ప్రశ్నించిన వారి గొంతు నొక్కడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. అధికారం అండతో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ప్రజల మద్దతుతో తిప్పికొడుతామని స్పష్టంచేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, ఇదే స్ఫూర్తితో రానున్న జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.