బషీరాబాద్, జూలై 7 : విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజన పథకం, పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నది. జీవన్గి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు వడ్డించిన అన్నం పూర్తిగా మాడిపోయి ఉండటాన్ని గమనించిన విలేకరులు ఫొటోలు తీస్తుంటే ఉపాధ్యాయురాలు అడ్డుచెప్పడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. మొత్తం 100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు నుంచి వడ్డించే వరకు ఒక్కో రోజు ఒక్కో ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తారు.
ఉపాధ్యాయుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అన్నం మాడిపోయింది. మాడిన అన్నాన్ని వేరు చేయకుండా నీళ్ల చారుతో విద్యార్థులకు అలాగే వడ్డించారు. ఆకలితో ఉన్న విద్యార్థులు చేసేదేమీ లేక అలాగే భుజించారు. విషయం తెలిసిన విలేకరులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుంటే.. ఎందుకు తీస్తున్నారని ఓ ఉపాధ్యాయురాలు అడ్డుకోవడం శోచనీయం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి పుట్టిన రోజు ఉండటంతో మధ్యాహ్న భోజన పర్యవేక్షణ చేయలేకపోయినట్లు తెలిసింది. మాడు అన్నంలో కార్సినోజెన్స్ ఉంటాయని, పిల్లలు దీన్ని తింటే కడుపునొప్పి, వాంతులు, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. తమ పిల్లలను బాగా చూస్తారని బడికి పంపితే, ఇలా విషం పెడతారా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇడ్లీ తింటలేరు, పాలు తాగుతలేరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి విద్యార్థులు అలవాటు పడతలేరని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. జీవన్గి ప్రాథమిక పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద అందించిన ఇడ్లీ, పాలు అలాగే మిగిలిపోయాయి. గమనించిన విలేకరులు ప్రశ్నించగా.. విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్‌ను అంతగా ఇష్టపడటం లేదని వివరించారు. పాలు వాసన వస్తున్నాయని, బోండాలు, ఇడ్లీ గట్టిగా, పూరీలు దొడ్డుగా ఉంటున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.