అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష నిబంధనలు పెట్టి అరకొరగా రుణాలను మాఫీ చేసి గొప్పలు చెప్పుకొంటున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అడ్డగోలు షరతులు పెట్టి అన్నదాతలను అగాథంలోకి నెట్టివేస్తున్నది. మొదటి, రెండో, మూడో విడుతల్లో కొంత మందికే రుణాలను మాఫీ చేయడంతో మిగిలిన రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రూ.2లక్షలకుపైగా అప్పు ఉన్నవారు తిరిగి చెల్లించాలని ఆంక్షలు విధించగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పులపాలవుతున్నారు.
వికారాబాద్, ఆగస్టు 26 : వికారాబాద్ మండలవ్యాప్తంగా ఉన్న రైతుల్లో 30 శాతం మందికి మాఫీ కాగా, ఇంకా 70 శాతం మంది రైతులకు రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది. వికారాబాద్ కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ధారూరు సొసైటీ బ్యాంకు తదితర బ్యాంకుల్లో అన్నదాతలు పంట రుణాలు తీసుకున్నారు. రుణాలు తీసుకోండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి హామీ మేరకు ఎంతో మంది గత సంవత్సరం కూడా పంట రుణాలు తీసుకున్నారు. అధిక శాతం పాతవారికి ఇటు కొత్తవారికి రుణాలు మాఫీ కాక ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ అంటూ అనేక కొర్రీలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మండిపడుతున్నారు.
ఏ పల్లెకు వెళ్లి పలుకరించినా రుణమాఫీ కాలేదన్న సమాధానాలే రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మండలంలోని గోధుమగూడ గ్రామంలో దాదాపు 250 మంది రైతులు ఉండగా, అందులో 80 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. దీంతో రుణమాఫీ కాని రైతులు అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటు ప్రభుత్వ నిబంధనలు, అటు సాంకేతిక సమస్యలతో అధికారులు సైతం రైతులకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అన్నదాతల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్‌కు రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా షరతుల్లేకుండా రుణాలను మాఫీ చేయాలని వికారాబాద్ మండల రైతులు వేడుకుంటున్నారు.
మొదటి విడుతలోనే మాఫీ అవుతదనుకున్నా..
వికారాబాద్ యూనియన్ బ్యాంకులో ఏడాది కింద రూ.70 వేల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీ రుణాలను మాఫీ చేస్తామని గొప్పలు చెబితే ఎంతో సంతోషపడ్డా. మొదటి విడుతలోనే నా అప్పు పోతదనుకున్నా. రెండో, మూడో విడుతలోనూ మాఫీ కాలె. ఇగ రోజూ బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగడమే సరిపోతున్నది. రైతులను నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్‌కు తగదు. ఇప్పటికైనా రైతుల బాధలను అర్థం చేసుకుని రైతులందరికీ రుణాలు మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి.
– కృష్ణవేణి, గోధుమగూడ, వికారాబాద్
మళ్లీ అప్పులపాలవుతున్నాం..
వికారాబాద్‌లోని కెనరా బ్యాంకులో రూ.1.10 లక్షలు పంట రుణం తీసుకున్నా. మూడో విడుతలో మాఫీ అవుతదనుకున్నా. జాబితాలో పేరు రాకపోవడంతో బ్యాంకు దగ్గరకు పోయినా. అధికారులను అడిగితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమన్నారు. తర్వాత వ్యవసాయ ఆఫీస్‌కు పోయి అధికారులను అడిగితే దరఖాస్తు రాసివ్వాలన్నారు. రోజూ తిరుగుతనే ఉన్నా.. అయినా మాఫీ జాడే లేదు. 2018లో అప్పు తీసుకుంటే బ్యాంకు వారేమో ఏటా మిత్తి డబ్బులు తీసుకుని రెన్యూవల్ చేశారు. అన్ని కరెక్టుగా ఉన్నప్పుడు మాఫీ ఎందుకు కాలేదని అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయడం సరికాదు.
– ఈడిగి గోపాల్‌గౌడ్, గోధుమగూడ, వికారాబాద్