ఉమ్మడి జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు గౌరమ్మకు పూజలు చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ‘చిత్తూ చిత్తూల బొమ్మ… శివుని ముద్దూల గుమ్మ’, ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ… ఏమేమి కాయొప్పునే గౌరమ్మా… అంటూ ఆడిపాడారు. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు పటాకులు కాల్చుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామాల సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసి, ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. యువతులు, మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి చుట్టూ ఆడిపాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలతో పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. రకరకాల పూలతో కూడిన బతుకమ్మలతో పుడమి పులకించింది. అనంతరం భక్తులు బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
