పరిగి, మే 27: రాష్ట్రంలో 750 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం ఆయ న వికారాబాద్ జిల్లాలోని ధారూర్, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అనంతగిరిలోని టీబీ శానిటోరియాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయ డం ద్వారా 53రకాల వైద్యసేవలు ప్రజలకు ఉచితంగా అందనున్నాయని చెప్పారు. దవాఖాన లో వైద్యం కోసం ఒక రోగి చేరితే రూ.2,100 ప్రభుత్వం మంజూరు చేస్తుందని, అందులో 35శాతం డబ్బులు వైద్యులు, సిబ్బందికి ఇవ్వ డం జరుగుతుందని, మిగిలిన మొత్తం దవాఖా న అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవం జరిగితే రూ.3000 చొప్పున దవాఖానకు ఇచ్చేలా మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఔట్ పేషెంట్లకు వైద్యసేవలు అందించే గది, ల్యాబ్ టెక్నీషియన్ గది, ఫార్మాసిస్ట్ గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా ప్రతి పీహెచ్సీలో వైద్యులు, సిబ్బందిని రాష్ట్రస్థా యి నుంచే నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతినెలా సమీక్షలు నిర్వహిస్తున్నారని, జిల్లాలో వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా లో 9 మంది డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉన్నారని, వారందరూ ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి దవాఖానలకు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇకమీదట ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలపై పర్యవేక్షణ పెంచాల్సిన బాధ్యత వారిదేనని, ఇందుకోసం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, ప్రోగ్రామ్ ఆఫీసర్ల వాహనాలకు జీపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వర కు వారు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. టీబీ, మలేరియా తదితర వ్యాధులను అరికట్టడంలో వికారాబాద్ జిల్లా వైద్యులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. మిగతా వైద్యసేవల్లోనూ తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. 60 ఏండ్ల పైబడిన వారందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని, వ్యాక్సినేషన్‌తోనే కొవిడ్‌పై విజ యం సాధించామన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. శిథిలావస్థకు చేరిన దవాఖానల భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామన్నారు. సమావేశం లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాంభట్, జీవరాజ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ధరణికుమార్, ప్రోగ్రామ్ అధికారులు సాయిబా బా, అరవింద్, రవీంద్రయాదవ్, లలి త, జిల్లాలోని వైద్యులు పాల్గొన్నారు.
ప్రజాధనాన్ని వృథా చేయొద్దు
వికారాబాద్, మే 27: దవాఖానల్లో మందులను అవసరం ఉన్న మేరకే తీసుకోవాలని, అతిగా తీసుకొని ప్రజాధనాన్ని వృథా చేయొద్దని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతగిరిలోని టీబీ శానిటోరియాన్ని సందర్శించి, వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని ఎక్స్‌రేలు, వార్డులను పరిశీలించారు. రోగుల వివరాలు, మందులు, వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. అక్కడి నుంచి ఆయన పట్టణంలో ని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. దవాఖానలో ప్రసవాలు ఎం దుకు చేయడంలేదని వైద్యాధికారులను నిలదీశారు. గోదాములో మందులను సక్రమంగా నిలువ చేయకుండా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉన్నమేరకే మందులు కొనాలని, ఎక్కువగా మందులు కొని వృథా చేయొద్దన్నారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆయన అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ వారికి స్వామి వారి జ్ఞాపికను అందజేశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో తుకారాంభట్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జీవరాజ్, టీబీ శానిటోరియం సూపరింటెండెంట్ సుధాకర్, వైద్యులు రవీంద్రయాదవ్, వినోద్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
ధారూర్ పీహెచ్‌సీని మరింత మెరుగుపర్చుకోవాలి
ధారూరు, మే 27: ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని, ఔట్ పేషెంట్ల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. దవాఖానలో ఉన్న ఔట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పీహెచ్‌సీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నదని, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశానుసారం ధారూరులోని పీహెచ్‌సీని సందర్శించి, రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. ఇక్కడి వైద్య సిబ్బంది పనితీరు బాగుందని, ఔట్ పేషెంట్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఆయన వెంట వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాంభట్, డాక్టర్ మనోహర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రవీందర్‌యాదవ్, డాక్టర్ అరవింద్‌కుమార్, డాక్టర్ సాయిబాబా, ధారూరు పీహెచ్సీ డాక్టర్ రాజు, వైద్య సిబ్బంది ఉన్నారు.