శామీర్ పేట్, మార్చి 9 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం(Ration rice seized )లారీని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్ వద్ద లారీని అదుపులోకి తీసుకుని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 23యూ5899 నెంబర్ గల లారీలో నందిగామకు చెందిన డ్రైవర్ ఎస్కే సర్ధార్, క్లీనర్ చంద్రం కలిసి దాదాపు 25 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆటోనగర్ మలక్ పేట్ నుంచి సిద్ధిపేట్కు తరలిస్తున్నారు.
ఇదే క్రమంలో ఎస్ఓటీ పోలీస్ లు శామీర్పేట్ ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బియ్యం తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.