పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన తాజా మాజీ సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. ‘చలో హైదరాబాద్’ శాంతియుత నిరసనకు సిద్ధమైన వారిని ఎక్కడి కక్కడ పోలీసులతో అరెస్టు చేయించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. ప్రధానంగా బీఆర్ఎస్కు చెందిన చాలామంది మాజీ సర్పంచులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. రౌడీమూకలు, సంఘ విద్రోహులను ఎత్తుకెళ్లినట్లు తమ వారిని అదుపులోకి తీసుకోవడంపై మాజీ సర్పంచ్ల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. నిధుల్లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నదని.. గతేడాదిగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని తాజా, మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని ప్రశ్నించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ప్రభుత్వం భేషజాలకు పోవద్దు.. నిధులు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని శాంతియుత నిరసనకు సిద్ధమైన తాజా మాజీ సర్పంచ్లను ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దారుణం. వారు అప్పులు చేసి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ నిధులను కూడా విడుదల చేయకపోవడం తగదు. రేవంత్ సర్కార్ భేషజాలకు పోకుండా వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించి వారిని ఆదుకోవాలి. అంతేకాకుండా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తాజా మాజీ సర్పంచ్లను విడుదల చేయాలి.
-అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే, షాద్నగర్
మాజీ సర్పంచుల అరెస్టు దారుణం
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శాంతియుత నిరసనకు వెళ్తున్న తాజా మాజీ సర్పంచులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు. శాంతియుత నిరసనను రాష్ట్ర ప్రభ్వుం పోలీసులతో అణగదొక్కడం దుర్మార్గమైన చర్య. వికారాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన తాజా మాజీ సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులను జాప్యం చేయొద్దు.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు