అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ నిచ్చి గద్దెనెక్కిన పాలకులు వాటిని గాలికొదిలి.. ప్రశ్నించినందుకే పగబడితే..తమను పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలోఉన్న బాధితులకు అండగా నిలిచింది నమస్తే తెలంగాణ.. వారి ఆవేదనకు అక్షర రూపమిచ్చింది.. వారి ఆగ్రహానికి నిలువుటద్దమై నిలిచింది.. వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చూపింది.. వారి అభిప్రాయాలు, ఆవేదనను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లింది.
ఓపికను పరీక్షిస్తే ఉపేక్షించమని లగచర్లలో గిరిజన రైతులు చేసిన తిరుగుబాటు కళ్లకు కట్టింది.. అర్ధరాత్రి పోలీసులు విద్యుత్సరఫరాను ఆపేసి ఇండ్లలోకి చోరబడి అరాచకం సృష్టిస్తే.. నమస్తే బాధితుల పక్షాన నిలిచి.. ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకటా.. రెండా.. ప్రజల అభిప్రాయాన్ని కాదని రాడార్ స్టేషన్ ప్రారంభించినప్పుడు వరుస కథనాలతో ప్రజల ఆవేదనను ప్రపంచానికి చూపింది. ఫార్మా రైతుల ఆక్రందన, ఫ్యూచర్ సిటీ పేరిట ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అడ్డగోలుగా ట్రిపులార్ అలైన్మెంట్ మార్పులతో బాధితులుగా మారిన సామాన్యులకు అండగా నిలిచింది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకుల భూ దాహానికి రోడ్డున పడుతున్న రైతుల కథలు ఒక్కొక్కటిగా ప్రపంచం ముందుంచి.. పాలకుల తీరును ఎండగట్టి.. ప్రజల గొంతుకగా ‘నమస్తే’ అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉన్నది…