మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 1 : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్తాపూర్ బీసీ హాస్టల్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. అత్తాపూర్ బీసీ హాస్టల్లో నాణ్యమైన భోజనం లభించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గడిచిన వారం రోజుల నుంచి గురుకులాల్లో మధ్యాహ్న భోజనంతో చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల నిర్లక్ష్యంతోనే మరణించిందన్నారు.
నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా మార్పు రావడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు ఉంటారని.. ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలపై నివేదిక తీసుకొని వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్వో రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు సంతోశ్, నాయకులు వంశీకృష్ణ, సాయికిరణ్‌గౌడ్, నికిత్కుమార్, శ్రీకాంత్, శివప్రసాద్‌నాయుడు, వినోద్, రామాంజనేయులు, ఆనంద్‌కుమార్, ఉపేందర్, శివరాజ్, వినయ్‌కుమార్, అఖిల్, హర్షశివరాం, అన్వేశ్, అభిరామ్, రాజు, చంద్రశేఖర్, మల్లేశ్, గణేశ్, సాయికుమార్, వీర, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.