ఇబ్రహీంపట్నం : బండరావిరాల మైనింగ్‌జోన్ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బండరావిరాలలో రైతుల నుంచి మైనింగ్జోన్కు భూ సేకరణ జరిగింది. అప్పట్లో రైతులను విస్మరించి పరిహారం ఇప్పించలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాజకీయ లబ్ధికోసమే రైతులను రెచ్చగొట్టి ఆందోళనకు తెరలేపుతున్నరన్నారు. బండరావిరాల రైతులకు గడిచిన రెండేండ్లుగా కొవిడ్ కారణంగా ఆలస్యమైందని దీనిని సాకుగా తీసుకుని కొందరు విపక్షపార్టీల నాయకులు క్రషర్ యజమానులను బ్లాక్మెయిల్ చేయడానికి రెచ్చగొడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 2007 సంవత్సరంలో మైనింగ్ భూములు తీసుకుని ఏండ్ల తరబడి వారికి డబ్బులిప్పించలేని మల్రెడ్డి రంగారెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దపెద్ద మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులను మభ్యపెట్టి ఉసిగొల్పడంతో ఒరిగేదేమీలేదని ఎవరు అన్యాయం చేస్తున్నారో రైతులకు తెలుసునని హితువు పలికారు. రైతులకు న్యాయం చేయడానికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడామని, అతి త్వరలో బండరావిరాల రైతులకు పరిహారం అందజేసి ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాధిత రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.