ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి నర్సింహ అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 5లక్షల ఎల్ఓసిని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మృతుడి భార్య పద్మమ్మకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రైతాంగ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు వారం రోజుల్లోనే రైతుబీమా పథకం కింద రూ. 5లక్షలు అందజేయటంతో వారి కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చబాష, సర్పంచ్ బండిమీది కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షడు కృష్ణ, మండల ప్రచార కార్యదర్శి శివలింగం, నాయకులు బాలరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సీఎం సహాయనిధితో నిరుపేదలకు అండగా..
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలకు గురవటంతో పాటు అనారోగ్యం పాలైన వారికి సీఎం సహాయనిధి పథకం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన జాటోతు బక్క అనారోగ్యంతో దవాఖానాలో చికిత్స పొందుతుండగా అతని వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం కింద మంజూరు చేయించిన రూ. 3లక్షల ఎల్ఓసిని వారి కుటుంబసభ్యులకు అందజేశారు.
అలాగే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన రమేశ్ అనే వ్యక్తి అనారోగ్యంతో నగరంలోని ప్రైవేటు దవాఖాలో చికిత్స చేయించుకోగా అతనికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 90వేల చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ముత్యాల చిన్న పాల్గొన్నారు.