ఔటర్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను అధికారులు సాగుకు యోగ్యం కాని భూములుగా రికార్డుల్లో నమోదు చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తమకు రైతుబంధు సాయం అందిందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో లేని నిబంధన ఇప్పుడెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఔటర్‌రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) కు లోపల, బయట ఉన్న పలు గ్రామాల్లోని రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మేము చేసిన పాపం ఏమిటి.. మాకెందుకు రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి తదితర మండలాలు, మున్సిపాలిటీల్లో ఉన్న భూములను అధికారులు సాగుకు యోగ్యం కాని భూముల కింద రికార్డుల్లో చేరడంతో సంబంధిత రైతులకు రైతుభరోసా అందడంలేదు.
తాము ఆ భూముల్లో కొన్నేండ్లుగా పంటలను సాగు చేసుకుని జీవిస్తున్నామని.. ఆ పొలాలను సాగుకు యోగ్యం కాని భూములుగా అధికారులు రికార్డుల్లోకి ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సర్వేనంబర్‌లోని ఎకరం భూమిలో ఒక ప్లాటున్నా ఆ సర్వేనంబర్‌లో ఉన్న మొత్తం భూమిని ప్లాట్ల కింద రాయడంతో మిగతా తొమ్మిది ఎకరాల రైతులకు కూడా రైతుభరోసా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో సగం మందికి కూడా రాని రైతుభరోసా..
వివిధ కారణాలను చూపించి జిల్లాలోని సగం మంది రైతులకు రైతుభరోసా అందకుండా అధికారులు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్లాట్లు, సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియలో భాగంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని సుమారు 50 నుంచి 60 గ్రామాల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తున్నాయని భావించి రైతుభరోసాను నిలిపివేశారు.
జిల్లాలో అర్హులు 3,24,000 మంది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో రైతుభరోసాకు 3,24,000 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు. వారికి సీజన్లో సుమారు రూ.300 కోట్లకు పైగా రైతుబంధు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వే శారు. గ్రేటర్ పరిధిలోని పలు మండలాలకు పూర్తిగా రైతుభరోసాను నిలిపేశారు. అలాగే, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లోని సర్వేనంబర్లను యూనిట్‌గా చేసుకుని భరోసాను నిలిపివేయడంతో అర్హులైన వందలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. తాము అర్హులమని.. రైతుభరోసా ఇవ్వాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు.
పదివేల మందికిపైగానే.. అందని పెట్టుబడి సాయం
ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాల్లోని మండలాలు, మున్సిపాలిటీల్లో పలు గ్రామాల్లో సుమారు పది నుంచి పదిహేను వేల మంది అర్హులైన రైతులు న్నా వారికి రైతుభరోసా అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుకు యోగ్యం కాని భూ ముల పేరుతో అధికారులు తప్పుడు సర్వే చేసి రికార్డుల్లో ఎంట్రీ చేశారని మండిపడుతున్నారు. వారు నేటికీ వరి, కూరగాయల పంటలను సాగు చేసుకుని జీవిస్తున్నారు. అధికారులు మరో సారి సర్వే చేసి.. తమ భూములకు రైతుభరోసా ఇప్పించాలని కోరుతున్నారు.
అర్హులకు రైతు భరోసా చెల్లించాలి..
ఔటర్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో నేటికీ వ్యవసాయం చేసుకుని ఎంతో మంది జీవిస్తున్నారు. వారందరికీ రైతుభరోసా చెల్లించాలి. వారి పొలాలను సాగుకు యోగ్యం కాని భూములుగా అధికారులు రికార్డుల్లో ఎక్కించడం చాలా దారుణం. గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రతి ఎకరాకు రైతుబంధు చెల్లించింది. ఆ సర్కార్ మాదిరిగా.. రేవంత్ ప్రభుత్వం కూడా అర్హులందరికీ రైతుభరోసా చెల్లించి ఆదుకోవాలి.
-మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు