సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తాము ఇచ్చిన గడువులోగా ఇళ్లు, స్థలాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకుంటే హైడ్రా ఆయా నిర్మాణాలను కూల్చివేయకతప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సున్నంచెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, బుమ్రుఖుద్దీన్దౌలా చెరువుల పునరుద్ధరణ పనులను కమిషనర్ రంగనాథ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. విమోస్ టెక్నోక్రాట్స్ రూ పొందించిన డీపీఆర్, కాన్సెప్ట్‌లను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా సున్నంచెరువు వద్ద స్థానికులు ఉంటున్న నివాసాల వద్దకు వచ్చిన రంగనాథ్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దని, ఇవన్నీ అక్రమ నిర్మాణాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 8 లోగా అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకుంటే తామే వచ్చి అన్నింటినీ తొలగిస్తామని హెచ్చరించారు. స్థానికులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారి మాటలను వినిపిం చుకోలేదు. చెరువులో పూడికతీత తీసేందుకు అందులోని నీటిని తొలగించేందుకు బ్రిడ్జి కింది భాగాన్ని కూల్చి నీళ్లు పోయేలా చేశారు. అనంతరం కూకట్పల్లి నల్లచెరువును రంగనాథ్ బృందం సందర్శించింది.
అక్కడ బఫ ర్ జోన్లో పట్టా భూములు కలిగిన వ్యక్తులతో చర్చించారు. నల్లచెరువును సుందరీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ,చెరువులో పట్టాభూములు కలిగిన వారికి ప్రభుత్వం నుంచి టీడీఆర్ లేదా నష్టపరిహారం రూపంలో అందుతుందని రంగనాథ్ తెలిపారు. ఆ తర్వాత తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, బుమ్రుఖుద్దీన్దౌలా చెరువులను సందర్శించి అక్కడ పరిస్థితులపై స్థానిక అధికారులతో చర్చించారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటిస్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ కింద సాయం చేస్తామని, ఇప్పటికే నివాసమున్న ఇళ్లను కూలగొట్టమని చెప్పారు. చెరువుల పరిరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణ పనుల్లో ఎక్కడా నివాసాలు తొలగించబోమని రంగనాథ్ స్పష్టం చేశారు.
సుమారు రూ. 58.50 కోట్లతో ఈ ఐదు చెరువులతో పాటు బతుకమ్మకుంటను మొదటివిడతగా అభివృద్ధి చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ చెరువుల్లోకి డివాటరింగ్ పనులను చేపట్టామని, ముందుగా చెరువులో ఉన్న వ్యర్థాలను బయటకు పంపి డ్రై చేసి ఆ తర్వాత పునరుద్ధరణ చేపడుతామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, జూన్ నాటికి చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తవుతాయని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అలాగే ప్రగతి నగర్ సంబంధించిన స్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో శుక్రవారం రంగనాథ్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న 304, 305, 306 ల సర్వే నంబర్లను ైక్లెమ్ చేస్తూ ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు పనులు చేస్తున్న నేపథ్యంలో సదరు స్థలాలను సైతం ఆయన పరిశీలించారు.