HYDRAA | సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): జూలై తర్వాత కడుతున్న నిర్మాణాల్లో అక్రమమని తేలితే కూల్చేయడం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం కూకట్‌పల్లిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను స్థానికుల ఫిర్యాదు మేరకు కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కూకట్పల్లి మండలంలోని కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలు, మట్టిని తీసుకొచ్చి చెరువును కబ్జా చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు చెరువులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. జూలై 2024 తర్వాత నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కచ్చితంగా కూల్చేస్తామని చెప్పారు.
గతంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల జోలికి కూడా వెళ్లమని, అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కడుతున్న నిర్మాణాలను మాత్రం కూల్చేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు తదనంతరం నిర్మించిన అక్రమ నిర్మాణాలను గూగుల్ మ్యాప్‌ల ద్వారా గుర్తించి కూలుస్తామన్నారు. అలాగే ఇటీవల తీసుకున్న అనుమతులను కూడా హైడ్రా పరిశీలిస్తుందని, వాటిలో లోపాలుంటే ఆయా నిర్మాణాలను అడ్డుకుంటామని వెల్లడించారు. కాముని చెరువులో మట్టిని పోసి చెరువును కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని తెలిపారు. చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం తగదని, ఆ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తామన్నారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని, వాటిని కూల్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు.
చెరువుల సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను రంగనాథ్ ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాముని చెరువులో వెలిసిన రాఘవేంద్ర కాలనీలో పాత ఇండ్లపై చర్యలు ఉండవని, ఇటీవలే కొందరు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు ఉంటాయన్నారు. చెరువు కబ్జాలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్నారు. కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లోని నివాసితులు చెరువులు కబ్జా కాకుండా చూడాలని స్థానికులను కోరారు.