HMRL | సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) :హైదరాబాద్ మెట్రో రైళ్లు ఒకే పట్టాలపైకి వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది…ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సంఘటనలో రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదే కనుక జరిగితే మెట్రో ప్రయాణం నిజంగా సురక్షితమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అలా వచ్చిన సందర్భంలో రెండు రైళ్లు ఢీకొనే అవకాశం ఉంటుందా? ఢీకొడితే ఏ మేరకు ప్రమాదం జరుగుతుంది.?
ఇంజన్ ప్రమేయం లేకుండా నిలిపివేసే అవకాశం ఉందా అనే అనుమానాలను నివృత్తి చేస్తూ హెచ్ఎంఆర్ఎల్ వినియోగించిన అధునాతన టెక్నాలజీపై స్పష్టత నిచ్చారు. మెట్రో రాకపోకల సమాచారం ఆధారంగా పనిచేసే సాంకేతికత విధానం ద్వారా అసలు ఢీకొనే అవకాశమే లేదని చెబుతున్నారు. అలాంటి సందర్భం ఎదురైనా… రెండు మెట్రో రైళ్ల మధ్య కనీస దూరం 30-50 మీటర్ల దూరం ఉండేలా ప్రయాణిస్తాయని చెబుతున్నారు. దీనికోసం దేశంలోని తొలిసారిగా కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ) విధానాన్ని వినియోగించినట్లు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదని, ఢీకొనేందుకు అవకాశమే ఉండదని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోనే తొలిసారిగా ఎలివేటెడ్ కారిడార్ విధానాన్ని పీపీపీ విధానంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోకు చోటు దక్కింది. అయితే నిర్మాణ దశ నుంచి మెట్రో రైలు పట్టాలెక్కేంత వరకు వినియోగించిన సాంకేతికతపై మొదటి నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసలు మెట్రో రైలు ప్రయాణం సురక్షితమేనా? రెండు మెట్రో రైళ్లు ఢీకొంటాయా.. అనే అనుమానం ఇప్పటికీ ఉంది. కానీ గడిచిన ఏడేండ్లలో ఏనాడూ ప్రమాదాలకు ఆస్కారం లేకుండానే రాకపోకలను మెట్రో సంస్థ నిర్వహించింది. ఇదేలా సాధ్యమనే ప్రశ్నలకు సమాధానంగా… మెట్రో రైల్ రాకపోకలను నియంత్రించే సీబీటీసీ విధానంతోనే వీలు పడుతుందని, దీంతోనే ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా రైళ్ల ప్రయాణం ఉంటుందని చెబుతున్నారు.
సాంకేతిక, మానవ తప్పిదాల దృష్ట్యా ఒకసారి రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వస్తే గనుక ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలనే దానిపై మొదటి నుంచి చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా సీబీటీసీ టెక్నాలజీని మెట్రో సంస్థ వినియోగంలోకి తీసుకువచ్చింది. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ద్వారా నియంత్రించగలిగే వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా మానవ, యాంత్రిక తప్పిదాలకు తావు లేకుండా మెట్రో రాకపోకలు సాగించే వీలు ఉంటుందని మెట్రో ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ రెండు రైళ్లు ఒకే పట్టాపైకి వచ్చినా…. కనీసం 30 మీటర్ల దూరంలోనే ఆటోమేటిగ్గా నిలిచిపోయేలా గార్డ్ రైల్ టెక్నాలజీ పనిచేస్తుందని చెబుతున్నారు. దీంతో ఏమాత్రం రెండు ఇంజన్లు ఢీకొనే అవకాశం ఉండదంటున్నారు.
పీక్ అవర్స్‌లో తక్కువ సమయంలోనే రెండు, మూడు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చే సందర్భాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైల్ నిర్వహణ జరిగినట్లు చెబుతున్నారు. ఇదే ప్రయాణికులకు రక్షణ కవచంలా పనిచేస్తుందని, దీంతో రెండు మెట్రో రైళ్లు ఢీకొనకుండా నియంత్రించగలిగే సామర్థ్యం దేశంలోని ఏ మెట్రో రైలుకూ లేదని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ప్రమాదాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ అన్ని మెట్రో రైళ్లకు ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా స్పష్టం చేశారు.