మొయినాబాద్, ఆగస్టు 24 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మొయినాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు మీద రద్దీ విపరీతంగా పెరుగడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు పనులను చేయించాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి జాతీయ రహదారికి సంబంధించిన ఉన్నతాధికారులతో ఫోన్లో నాయకుల ముందు స్పీకర్ పెట్టి మాట్లాడారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం రెండు నుంచి మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వెంటనే పనులు వారం రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. లేకపోతే టెండర్‌ను రద్దు చేయడం జరుగుతుందని సంబంధిత కాంట్రాక్టర్‌ను కూడా హెచ్చరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారం రోజుల్లో రోడ్డు విస్తరణ పనుల ప్రగతి తమకు కనిపించాలని మంత్రి అధికారులతో చెప్పారు.
పంచాయతీ రాజ్ నుంచి ఆర్ అండ్‌బీకి మార్చుతాం..
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని పొడవైన రోడ్లను పంచాయతీ రాజ్ నుంచి ఆర్‌అండ్‌బీకి మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. మొయినాబాద్ మండల పరిధిలోని కవేలిగూడ నుంచి వయా శ్రీరాంనగర్, సురంగల్, మొయినాబాద్, పెద్దమంగళారం గ్రామాల మీదుగా చందానగర్ వరకు ఉన్న పంచాయతీ రాజ్ రోడ్డును ఆర్అండ్బీ రోడ్డుకు మార్చాలని స్థానిక రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, షాబాద్ దర్శన్, మాజీ సర్పంచ్ మాణెయ్య, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీరాజ్ రోడ్లను ఆర్‌అండ్‌బీకి మార్చడం జరుగుతున్నదని, రోడ్లు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని మంత్రి హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ రోడ్డు ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామన భీంభరత్, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, షాబాద్ దర్శన్, కీసరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ మాణెయ్య, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, నాయకులు రవియాదవ్, మహేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, షాబాద్ శ్యాం, అమర్నాథ్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.