జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ వ్యసనానికి యువత బానిసగా మారి అప్పులు తీసుకొచ్చి ఆటలాడి.. వాటిని తేర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. జిల్లాలో పేకాటపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. పేకాటకు అలవాటు పడిన వారిని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల వంటి పోలీస్ సబ్డివిజన్ల పరిధిలో పెద్ద మొత్తంలో ఆన్లైన్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. లోన్ యాప్‌లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేసిన యువత వాటిని తీర్చలేక.. వారు పెట్టే బాధలు భరించ లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నది. యువత జీవితాలను నాశనం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌లను అరికట్టాలని బాధితుల తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ యువత తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నది. మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇటీవల పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని సంపాదించి రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తూనే ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడి.. చేసిన అప్పులు తీర్చలేక తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, పోచారం గ్రామాలకు చెందిన యువకులు ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడి.. తెచ్చిన అప్పులు తీర్చలేక లోన్ యాప్‌లు పెట్టే బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. అలాగే.. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కూడా చేసిన అప్పులు తీర్చలేక ఇబ్రహీంపట్నం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్, తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం వంటి ప్రాంతాలకు చెందిన పలువురు యువకులూ ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా మారి తనువులు చాలించారు. తాజాగా ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్లైన్ గేములు ఆడుతూ అనేకమంది యువకులు సర్వం కోల్పోతున్నారు. అదేపనిగా బెట్టింగ్ గేములు ఆడుతూ.. ఆస్తులనూ అమ్ముకుంటున్నారు. బెట్టింగ్‌లు ఆడేందుకు అప్పులు చేసిన వారు సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో రుణాలు ఇచ్చిన సంస్థలు వేధింపులకు గురిచేస్తున్నాయి. వాటిని తట్టులేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. యువత ఇలాంటి వ్యసనానికి బాలిస కావొద్దు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. యువతీయువకుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
-కేపీవీ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ