Yacharam | యాచారం, మే 29 : ఆలయ తాళాలు పగుల గొట్టి ఆలయంలో ఉన్న హుండీతో పాటు విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన కథనం.. మండలంలోని నజ్దిక్ సింగారం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో కృషి తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలను పగలగొట్టి ఆలయం లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న హుండీ తాళాలను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను, అమ్మవారి ఆభరణాలు (పూస్తే మెట్టెలు), విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.
గురువారం ఉదయం ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం ఏసిపి కేపీవి రాజు, యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఎస్సై మధు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడిన తీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సంబంధించి పోలీసులు సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో చోరికి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.