వికారాబాద్, ఏప్రిల్ 2, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.4482 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే అధిక ఆదాయం సమకూరింది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతున్న దృష్ట్యా గత మార్చి నెలలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.446 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.621 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం పెరుగడం గమనార్హం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి, రీజినల్ రింగ్‌రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరించడం, మోమిన్‌పేటలో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా వరకు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ వరకు నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి.
రూ.4482 కోట్ల ఆదాయం..
జిల్లాలోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం రూ.4482.64 కోట్ల రెవెన్యూ వచ్చింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.1276.97 కోట్ల రాబడి వచ్చింది. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రెవెన్యూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అనంతరం గండిపేట, శేరిలిగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లావ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2,48,033 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.99.47 కోట్లు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ద్వారా రూ.1276.97 కోట్లు, రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.350.45 కోట్లు, శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.78.65 కోట్లు, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.447.41 కోట్లు, శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.104.94 కోట్లు, గండీపేట సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.852.37 కోట్లు, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.153.68 కోట్లు, అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.38.02 కోట్లు, వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.137.08 కోట్లు, చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.144.96 కోట్లు, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.103.12 కోట్లు, షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.63.65 కోట్లు, సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.125.45 కోట్లు, ఫరూఖ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.90.91 కోట్లు, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.210.06 కోట్లు, పెద్ద అంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.81.58 కోట్లు, హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.66.25 కోట్లు, కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.2.08 కోట్లు, పరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.9.26 కోట్లు, తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.10.74 కోట్లు, వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.35.44 కోట్ల రెవెన్యూ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాలో జమైంది. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో అత్యధికంగా రూ.446 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.
2,48.033 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్..
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,48,033 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1455 డాక్యుమెంట్లు, షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 8683, ఫారూఖ్‌నగర్‌లో 17041, చేవెళ్లలో 9211, హయత్‌నగర్‌లో 7321, ఇబ్రహీంపట్నంలో 17,420, పరిగిలో 2778, తాండూరులో 4035, వికారాబాద్‌లో 6955, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 24,367 డాక్యుమెంట్లు, సరూర్‌నగర్‌లో 8146, చంపాపేట్‌లో 15,298, పెద్ద అంబర్‌పేటలో 10,032, రాజేంద్రనగర్‌లో 13,179, మహేశ్వరంలో 21,596 డాక్యుమెంట్లు, శంషాబాద్‌లో 9984, శేరిలింగంపల్లిలో 13,037, శంకర్‌పల్లిలో 5695, గండీపేట్లో 16,941 డాక్యుమెంట్లు, వనస్థలిపురంలో 14,334, ఎల్బీనగర్లో 12,622, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 7903 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయ్యాయి.