షాబాద్, జూన్ 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యా న్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఒకచోట స్టాక్ లేక దుకాణాలను మూసి వేస్తుండగా.. మరోచోట స్టాక్ ఉన్నా సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో మిషన్లో వేలిముద్రలు పెట్టేందుకు చాలా సమ యం పడుతున్నది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గతంలో నెల రోజులకోసారి రేషన్ బియ్యం ఇచ్చే సమయంలో 15 నిమిషాల వ్యవధిలో లబ్ధిదారుడికి బియ్యం అందేది. అక్కడ సర్వర్ మిషన్లో ఒకేసారి వేలిముద్రలు పెట్టి, అదే సమయంలో బియ్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో నెల కోటా బియ్యానికి ఒక్కోసారి తూకం వేయా ల్సి వస్తున్నది. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్రం ఇచ్చే బియ్యానికి మరోసారి వేలిముద్ర వేయిస్తున్నారు. ఇలా మూడు నెలలు కలిపి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఉన్న గ్రామాల్లోని రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండడంతో తెల్లవారుజాము నుంచే సంచులు పట్టుకుని లబ్ధిదారులు షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. పనులు మానుకుని బియ్యం కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెల రేషన్ బియ్యం కోసం రెండు సార్లు వేలిముద్ర వేయాల్సి వస్తున్నదని.. మూ డు నెలల బియ్యానికి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారని విసుగు చెందుతున్నారు. క్యూలో నిలబడిన అరగంట తర్వాతే తమ వంతు వస్తున్నదని.. దానికి తోడు సర్వర్ సరిగ్గా పనిచేయక ఇబ్బందులు తప్పడంలేదని పలువురు పేర్కొంటున్నారు. అన్నీ కలిపి ఒకే స్లిప్పు గా ఇస్తే కొంచెమైనా ఇబ్బంది తగ్గేదని.. లబ్ధిదారులు వాపోతున్నారు.