యాచారం, ఏప్రిల్27: ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ హోంగార్డు మృతి చెందిన ఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ నందీశ్వర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం.. మండలంలోని గున్గల్ గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్ (35) హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
గ్రామంలో తన ఇంటి ఎదుట ఉన్న డ్రైనేజీ విషయంలో ఇరుగుపొరుగు వారైన ప్రశాంత్, పవన్, యాదమ్మ అనే వ్యక్తులకు వెంకటేష్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో వెంకటేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడితో గొడవపడి దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు తన భార్యతో యాచారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.
అక్కడ తీవ్ర అస్వస్థతకు గురైన అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే వెంకటేశ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని వనస్థలిపురం పీఎస్‌కు తరలించారు. తన భర్తను ప్రశాంత్, పవన్, యాదమ్మ అనే ముగ్గురు కలిసి ఛాతిపై కొట్టడంతోనే తన భర్త మృతి చెందినట్లు మృతుడి భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.