రంగారెడ్డి, మే 16 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా నిలువరించేందుకు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ లేఅవుట్లను ఏర్పాటు చేసింది. ఈ వెంచర్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు పోటీపడి మరీ ప్లాట్లను కొన్నారు.
అయితే.. అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఆ లేవుట్లపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ శీతకన్ను చూపుతున్నదన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని కోకాపేట, తొర్రూరు, మోకిల, మన్నెగూడ తదితర ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున వెంచర్లను ఏర్పాటు చేశారు. అవి హెచ్ఎండీఏ వేసిన వెంచర్లు కావడం, టైటిల్ క్లియర్‌గా ఉండడం.. ఆ ప్లాట్లలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు, ఆటస్థలాలు వంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆ ప్లాట్లు హాట్‌కేక్‌లా అమ్ముడు పోయాయి. అయితే, ప్రభుత్వం మారడంతో ఈ వెంచర్ల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదన్న ఆరోపణలున్నాయి.
హెచ్ఎండీఏ నియమ నిబంధనల ప్రకారం 18 నెలల్లోనే ఆయా లేఅవుట్లల్లో మౌలిక వసతులు కల్పించాలి. విద్యుత్ సౌకర్యం, రహదారులు వంటి వాటిని ఏర్పాటు చేయాలి. లేఅవుట్లను వేలం వేసినప్పుడే హెచ్ఎండీఏ అధికారులు ఈ కాల పరిమితిలో అన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది గడిచినా ఇప్పటికీ మౌలిక వసతుల కల్పనపై ప్రస్తుత సర్కార్ దృష్టి సారించడంలేదు. దీంతో ప్లాట్లదారులు త్వరగా వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ర్టానికి భారీగా సమకూరిన ఆదాయం..
జిల్లాలోని మోకిళ్లలో 165 ఎకరాలు, కుర్మల్‌గూడలో 16.35 ఎకరాలు, తొర్రూరులో 170, మన్నెగూడలో 16 ఎకరాల్లో ఈ వెంచర్లను హెచ్ఎండీఏ ఏర్పాటు చేయగా.. వేలాది మంది అప్పులు చేసి మరీ ప్లాట్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా హెచ్ఎండీఏకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. అయితే, 15 నెలలు గడిచినా ఇప్పటికీ ఆ లేఅవుట్లలో 50 శాతం కూడా మౌలిక వసతులను కల్పించలేదు. ప్లాట్లదారులు ఇండ్లు నిర్మించుకునేందుకు ముందుకొస్తున్నా.. మౌలిక వసతులు లేని కారణంగా పనులను ప్రారంభించడంలేదు.