రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/షాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్ : జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. వారంతా నిద్రలో ఉండగా టిప్పర్ అతివేగంగా వచ్చి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు తెల్లవారు జామున 72 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. డ్రైవర్ దస్తగిరి బాబా తెల్లవారుజామున 4:30 గంటలకు తాండూరు డిపో నుంచి బయల్దేరారు. అక్కడి నుంచి 5:30 గంటలకు వికారాబాద్ చేరుకున్నారు. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ గేట్ సమీపానికి 6:30 గంటలకొచ్చారు. అక్కడ చేవెళ్ల నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొంది. అతివేగంగా బస్సు, టిప్పర్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు.
వెంటనే టిప్పర్ ఆర్టీసీ బస్సుపై కుడివైపు పడిపోవడంతో అప్పటికే ఓవర్ లోడ్‌తో ఉన్న కంకర, దుమ్ము బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. దీంతో పలువురు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. వెంటనే కంకర కింద ఉన్న ప్రయాణికులను బయటికి తీయడంతో ప్రమాదం నుంచి మరో ఇద్దరు బయటపడ్డారు. ప్రమాదానికి కంకర టిప్పరే కారణమని అధికారులు నిర్ధారణకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. క్రేన్ సహాయంతో టిప్పర్‌ను బయటికి లాగి మృతదేహాలను బయటికి తీశారు.