ఇబ్రహీంపట్నం : వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటల సాగులో ( Cultivation ) సరైన సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రైతు కమిషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్( Ramulu Nayak) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ముఖ్యంగా రైతులు పంటల మార్పిడి విధానం పాటించటంతో పాటు తక్కువ యూరియా వాడటం, సాగుఖర్చును తగ్గించటంతో పాటు అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. సాగునీటిని ఆదాచేసి భావితరాలకు అందించాలన్నారు. సుస్థిర ఆధాయాన్ని పాటించాలన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
పంటలకు ఎలాంటి చీడపీడలు సోకినా సొంతంగా నిర్ణయం తీసుకోకుండా అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు సుస్థిర వ్యవసాయంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్‌రెడ్డి, సునిత, వ్యవసాయాధికారులు విద్యాదరి, శ్రవణ్‌కుమార్, సృజన తదితరులు పాల్గొన్నారు.