రంగారెడ్డి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నదని స్థానికులు మండిపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్లోని 24 వార్డుల్లో 13 వార్డులను బీఆర్ఎస్ గెలుచు కోగా.. స్వతంత్ర అభ్యర్థి, ఒక బీజేపీ అభ్యర్థి మద్దతుతో చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు సంఖ్యాబలం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ లేనిపోని అడ్డంకులు సృష్టించి.. ఆ ఎన్నిక జరుగకుండా అడ్డుకుంటున్నదని పలువురు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ యాదగిరికి పరోక్షంగా కాంగ్రెస్ మద్దతిస్తూ ఆయన కుటుంబసభ్యులతో కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది. ఆయన కుమారుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడంతో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక ను వాయిదా వేయాలని న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో అప్పటినుంచి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతున్నది.
అలాగే, బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ నీలం శ్వేత ఓసీ అయి ఉండి బీసీ సర్టిఫికెట్ ద్వారా పోటీ చేసి గెలుపొందారని, ఆమె ఎన్నికను రద్దుచేయాలని, అలాగే, మరో కౌన్సిలర్ చిలుకల బుగ్గరాములు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన స్వగ్రామమైన తులేకలాన్‌లో ఓటు వేశారని, అలాగే, ఇబ్రహీంపట్నంలోనూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేశారని.. ఆయన ఎన్నికనూ రద్దు చేయాలని కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు వారి ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో రోజురోజుకూ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్‌పార్టీ సాగదీసే ధోరణిని అనుసరిస్తున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏడోవార్డు నుంచి ఎన్నికైన సుదర్శన్‌రెడ్డిని బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. అందులో భాగంగానే గత మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 15 మంది కౌన్సిలర్లు ఆయన్ను బలపర్చారు. చైర్మన్ ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే హైకోర్టు నుంచి ఎన్నికల అధికారికి ఆ ఎన్నికపై ఆపాలని ఉత్తర్వులు రావడంతో.. ఆ ప్రక్రియను నిలిపేశారు. ఈ నేపథ్యంలోనే సుదర్శన్‌రెడ్డి కౌన్సిల్ సమావేశంలో తనను 14 మంది బలపర్చారని.. తనను వెంటనే చైర్మన్‌గా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. సుదర్శన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ విచారించారు. నిబంధనల ప్రకారం చైర్మన్‌గా తన పేరును ప్రకటించకుండా రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి కావాలనే అధికారులు తాత్సారం చేస్తున్నారని సుదర్శన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ సమాధానం కోసం కేసును మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోయాడని ఆయన భార్య ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం ఠాణాలో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతడి కుమారుడు హైకోర్టును ఆశ్రయించగా.. యాదగిరిని వెంటనే కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. కాగా, గత మంగళవారం మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు యాదగిరి రాగా.. అతడ్ని పోలీసులు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. ‘ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితోపాటు మరికొందరు తనను బలవంతంగా చీరాల బీచ్‌కు తీసుకెళ్లారని.. ఈ విషయం తెలుసుకుని తన భార్య, కుమారుడు చీరాలలో కలిసేందుకు వచ్చినా కలువనీయలేదని, అలాగే, గత సోమవారం చైర్మన్ ఎన్నికలో పాల్గొనొద్దనే ఉద్దేశంతో తనను హైదరాబాద్‌లోని పలుచోట్ల తిప్పారని” న్యాయమూర్తి ఎదుట వాగ్మూలం ఇచ్చారు. దీంతో కిడ్నాప్ కేసులో తమ పేర్లు చేర్చుతారని భావించిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి స్పందిస్తూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం హైకోర్టు స్టేతో నిలిచిపోగా.. అప్పటినుంచి పలు రకాల అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. శుక్రవారం చైర్మన్ ఎన్నిక జరుగు తుందని అందరూ భావించినా.. కోర్టు కేసుల నేపథ్యంలో నిర్వహించలేదు. అలాగే, సుదర్శన్‌రెడ్డి కూడా కోర్టును ఆశ్రయించగా ఆ కేసు మంగళవారానికి వాయిదాపడింది. కోర్టు ఎన్నికను జరపాలని ఆదేశిస్తున్నా.. ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.