పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 13 : వానకాలంలో నిండిన చెరువులు, కుంటలను వీక్షించడం, సరదాగా ఈత కొట్టేందుకు యువతతో పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, ముఖ్యంగా యువతకు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో చెక్‌డ్యామ్‌లు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతైన వారు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడంతో సంతోషాల మాటున అపాయాన్ని కొనితెచ్చుకుంటున్నారు. నగరంలోని బార్కాస్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి నీటి అందాలను వీక్షించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్టు మండలంలోని పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ వద్ద ఉన్న చెక్‌డ్యాం వద్దకు వచ్చారు. నీటి అందాలను వీక్షిస్తూ.. అందులోకి దిగి గల్లంతయ్యారు. మరుసటిరోజు విగతజీవులుగా కనిపించారు.ఇటీవల మండలంలోని మరో చెక్‌డ్యాం వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి ప్రాణాలు వదిలారు. జలాశయాలు, చెక్‌డ్యాంలు, అలుగుపారుతున్న చెరువుల వద్ద కొందరి అత్యుత్సాహం ఆ కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది యువకులు పట్టించుకోకపోవడంతో ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మండలంలోని గండి చెరువు, పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ సమీపంలోని చెక్‌డ్యాంతోపాటు మండలంలో అలుగుపారుతున్న చాలా చెరువుల వద్ద స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. అయినప్పటికీ కొంతమంది వాటిని కనీసం పట్టించుకోవడంలేదు. ప్రమాదమని తెలిసి కూడా ముందుకెళ్తున్నారు. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
సెలవులు వస్తే చాలు
సెలవులు వచ్చాయంటే చాలు, వారాంతమైనా సరే చాలామంది స్నేహితులతో కలిసి నగర శివారు ప్రాంతాలకు వస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు పడటంతో శివారులోని చాలా చెరువులు, చెక్‌డ్యాంలు నీటితో నిండాయి. అలుగుపారుతూ జలపాతాలను తలపిస్తున్నాయి. ఇవి స్థానిక యువతతోపాటు నగరవాసులను మరింత ఆకట్టుకుంటున్నది. జలపాత అందాలను చూస్తున్న యువకులు ఆ సమయాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది సంయమనంతో పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన కలిగి ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు. నీటిలోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రమాదకరంగా..
ఇటీవల కురిసిన పెద్ద వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలోకి భారీగా నీరు చేరి అలుగుపారుతున్నాయి. దీంతో నీరు పారుతున్న ప్రదేశమంతా నాచుపట్టి ప్రమాదకరంగా మారుతున్నది. కాలు పెడితే జారి కిందపడేలా తయారయ్యాయి. ఇవన్నీ తెలియక కొంతమంది నీటిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా ప్రమాదాల బారినపడుతున్నారు.నీటి అందాలను చూడగానే.. అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ అందాలను భద్రపరుస్తూనే.. జలపాతాలు కనిపించేలా సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నీటిలోకి దిగి.. కొంచెం కొంచెంగా లోతుకు వెళ్తూ ఫొటోలు దిగుతున్నారు. ఈ అత్యుత్సాహం చివరకు ప్రాణాల మీదకు వస్తున్నారు. మండలంలోని ఆరునెలల కిందట చెరువు వద్ద సెల్ఫీలు తీసుకుంటూనే ఇద్దరు అందులో మునిగి చనిపోయారు. లోతును అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నీటితో కొందరు పరాచకాలు ఆడుతున్నారు. ఈత వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగొద్దని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ, కొంతమంది అవేమీ పట్టించుకోవడంలేదు. నీటిలోకి దిగి జారిపడుతున్నారు. కొన్ని చెరువుల్లో ఈత తెలిసినవాళ్లు నీటిలోకి దిగుతుండటంతో రానివారు సైతం నీళ్లలోకి దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం
నగరానికి శివారులో ఉండటంతో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని చెరువులు, చెక్‌డ్యాంల వద్దకు జనం ఎగబడుతున్నారు. చెక్‌డ్యాంలు నీటితో నిండి అలుగుపారుతుండటంతో అచ్చం జలపాతాలను తలపిస్తున్నాయి. దీంతో వాటిని చూసేందుకు యువకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఠాణా పరిధిలో ప్రమాదకరంగా ఉన్న చెరువులను గుర్తించాం. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అక్కడ రక్షణ చర్యలు చేపట్టాం. హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగొద్దని హెచ్చరిస్తున్నాం. సెలవులు, వారాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– వాసం స్వామి, సీఐ, అబ్దుల్లాపూర్‌మెట్