వికారాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. తాండూరు మండలంలోని అంతారంలో ఇల్లు కూలింది. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఎర్రవల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై మూడు చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వికారాబాద్ నుంచి మోమిన్‌పేట, సదాశివపేట వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
మర్పల్లి, ఏప్రిల్ 18 : మండలంలోని కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఈడిగి వెంకటేశంగౌడ్ నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని రెండెకరాల్లో అరటి, మరో రెండెకరాల్లో బొప్పాయి పంటను సాగు చేయగా.. శుక్రవారం కురిసిన వర్షానికి అరటి, బొప్పాయి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. కొద్ది రోజుల్లో పంటలు కోతకు వచ్చేవని, అప్పులు చేసి వాటిని సాగు చేశానని.. సుమారు రూ.4 లక్షల నష్టం జరిగిందని బాధితుడు వెంకటేశం తెలిపాడు. ప్రభు త్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
యాలాల : మండలంలో గాలివాన బీభత్సంతో చెట్లు నేలకొరిగాయి. కొంతమేర పం టలకు నష్టం వాటిల్లింది. మధ్యాహ్నం వేడి తో ఇబ్బంది పడ్డ ప్రజలు సాయంత్రం వాన కురిసి చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలం లోని అంతారంలో ఈదురుగాలులకు డప్పు రాజుకు చెందిన ఇంటి రేకులు ఎగిరిపోయా యి. అదేవిధంగా ఎల్మకన్నె గ్రామంలో ఈదురుగాలులకు చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. దాంతోపాటు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పం దించి వెంటనే సరఫరాను పునరుద్ధరిం చాలని కోరుతున్నారు.
వికారాబాద్ : ఈదురు గాలులు బలంగా వీయడంతో వికారాబాద్ నుంచి ఎర్రవల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై మూడు చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వికారాబాద్ నుంచి మోమిన్‌పేట, సదాశివపేట వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందిప డ్డారు. ఈదురు గాలులకు ట్రాక్టర్‌పై వెళ్తున్న కొత్తగడికి చెందిన ఇద్దరు వ్యక్తులపై చెట్టు పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. గాయపడ్డ వారిని వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్ దవాఖానకు వెళ్లి పరామర్శించారు. అనంతరం రోడ్డుపై విరిగి పడ్డ చెట్లను వికారాబాద్ సీఐ భీమ్‌కుమార్, నవాబుపేట ఎస్ఐ అరుణ్‌కుమార్‌గౌడ్, స్థానికులు మూడు జేసీబీలతో తొలగించారు.
పెద్దేముల్ : మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. ఇన్ని రోజులు నీళ్లు లేక ఇబ్బంది పడగా.. ఇప్పుడు వడగళ్ల వర్షానికి పంట నేల పాలు కావడంతో అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.