సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్లపై నుంచి ఫ్లెక్సీలు ఎగిరిపోయి 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లపై పడటంతో చాలా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో అవి విరిగిపోయాయి.
బంజారాహిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్నగర్ సర్కిళ్లతో పాటు రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు కరెంటు లేదు. కాగా విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యవేక్షించారు.
వర్షం నిలిచిన తరువాత నగరంలో ఓ వైపు ట్రాఫిక్, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొన్నది. కొన్ని చోట్ల వర్షం ఆగిపోయి 2 గంటలు గడిచినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని వందలాది మంది ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు.
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రేటర్లో విద్యుత్ నెట్వర్క్ చాలా చోట్ల దెబ్బతినడంతోనే పునరుద్ధరణ పనులు ఆలస్యమైనట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షంలోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు ఎక్కి తీగలపై పడిన చెట్ల కొమ్మలు, ఇతర వస్తువులను తొలగించారని తెలిపారు. రాత్రంతా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేశామని అధికారులు తెలిపారు.