సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వాన..రాత్రి వరకు పడుతూనే ఉంది. భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరద ముప్పు నివారించడంలో బల్దియా, హైడ్రా.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమవ్వడంతో నగరవాసులు నరకయాతన అనుభవించారు. యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అబిడ్స్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరదనీరు పొంగిపొర్లి రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
ఎటుచూసినా రోడ్డుపై వరదనీరు ఉండడంతో ప్రధాన జంక్షన్ల వద్ద గంటలకొద్దీ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనుచూపుమేరలో ఉన్న వాహనాలు, భవనాలు కనిపించనంతగా వర్షం కురవడంతో చాలాచోట్ల నాలాలు పొంగి ప్రవహించాయి. వాహనాలు ఎటువైపు వెళ్లలేక, ఆగకుండా వర్షం కురుస్తూ ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో పోలీసులు నిస్సహాయంగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పట్టింది. ప్రధాన రహదారులు వర్షపు నీటితో మునిగి ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించడంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
కిలోమీటర్ ప్రయాణం.. గంట సమయం..!
గ్రేటర్లో దాదాపుగా ప్రధాన జంక్షన్లలో వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఒక్క కిలోమీటర్ ప్రయాణానికి సాయంత్రం నాలుగుగంటలకు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి గంట సమయం పడితే ఆరు గంటలకు ఏషియన్ హాస్పిటల్, అగ్రాసేన్ చౌక్, బీఆర్ఎస్ భవన్ నుంచి కేబీఆర్ జంక్షన్ వరకు సుమారుగా గంట పట్టినట్లు వాహనదారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా సాయంత్రం విద్యాసంస్థలు వదిలిపెట్టే సమయం, కార్యాలయాల్లో పనులు ముగించుకుని ఇంటికి తిరిగివెళ్లే సమయంలో వర్షం కురియడంతో అడుగడుగునా విద్యాసంస్థల బస్సులు, కార్లు, ఆటోలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్‌జామ్‌తో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు వర్షం నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ ఆగాలో తెలియక, అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్లు, మెట్రో బ్రిడ్జ్, దుకాణాల షెడ్ల కింద తలదాచుకున్నారు.
కొన్నిచోట్ల నాలుగు లేన్ల రోడ్డులో వెళ్లాల్సిన వాహనాలు ఒకటి, రెండులేన్లలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాప్రా, ఆర్పీరోడ్, ఎస్పీరోడ్, పాట్నీ క్రాస్‌రోడ్స్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, లిబర్టీ, బషీర్‌బాగ్, నాంపల్లి, హిమయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట వంటి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి నగరవాసులు నరకయాతన అనుభవించారు. ఐమాక్స్, ఖైరతాబాద్ బ్రిడ్జ్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వర్షంలో అధికంగా క్యాబ్‌లు..
నగరంలో కురిసిన భారీ వర్షంతో నగరవాసులు నరకం చూశారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఓ వైపు బస్సులు సమయానికి రాక.. క్యాబ్‌లు బుక్ చేసుకున్న వారికి చుక్కులు కనిపించాయి. ఓలా, ర్యాపిడో, ఉబర్ ఫేర్ ధరలు భగ్గుమన్నాయి. మూడు కిలో మీటర్ల దూరానికి రూ.250కి పైగా చార్జీలు చూపించాయి. మరికొన్ని యాప్‌ల్లో రైడ్ బుక్ అవ్వడానికి చాలా సమయం పట్టింది.
అదనంగా డ్రైవర్‌కు డబ్బులు జత చేసి..సెలెక్ట్ చేస్తే ట్రిప్ ఓకే అయిందని స్రవంతి అనే ప్రయాణికురాలు తెలిపింది. డబ్బులు అదనంగా యాడ్ చేయకపోతే ట్రిప్పు ఓకే కాకుండా తీవ్ర ఆలస్యమవుతుందని వివరించింది. రూ.50 ఉండే ట్రిప్ రూ.200 వరకు చూపెట్టిందంటూ చెప్పింది. ఆటోలు, క్యాబ్‌లు వర్షాన్ని క్యాష్ చేసుకుని ప్రయాణికులపై భారం మోపాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్‌ల నుంచి క్యాబ్ సేవల ధరలు మూడు రెట్లు అధికంగా చూపించాయని ఐటీ ఉద్యోగులు తెలిపారు.
కమిషనరేట్ పోలీసుల హెచ్చరిక..!
పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు అత్యవసర సూచనలు చేశారు. వర్షం కురుస్తుండడంతో ఇంట్లో ఉన్నవాళ్లెవరూ బయటకు వెళ్లవద్దని సూచించారు. అదే విధంగా ఆఫీసుల్లో ఉన్న వాళ్లు వర్షం పూర్తిగా నిలిచేవరకు బయలుదేరవద్దని హెచ్చరించారు. నగరంలో రోడ్లపై పెద్ద ఎత్తున వరద పారుతుండడంతో రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడ ఉన్నవారు అక్కడే సురక్షితంగా ఉండాలని, ఏదైనా అత్యవసర సహాయం కోసం 100కు డయల్ చేయాలని ప్రజలకు పోలీసులు సూచించారు.
56 ఫీడర్లలో సమస్యలు..
గ్రేటర్లో కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ సర్కిల్ పరిధిలో 11 కేవీ ఫీడర్లు 56, సుమారుగా 21 డీటీఆర్‌లలో సరఫరా నిలిచిపోయింది. వైశాలినగర్, నవీన్‌నగర్, ఓయూకాలనీ, జేవీజీహిల్స్, మూన్కేఫ్ ఫీడర్, ఐడీపీఎల్, వసుధ, మధురానగర్ ఏలీప్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై చెట్లకొమ్మలు, ఇతర సామగ్రి పడడంతో ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. ఐడీపీఎల్ వద్ద 11కేవీ ఫీడర్పై భారీవృక్షం పడడంతో సరఫరా నిలిచింది. దీంతో విద్యుత్ సిబ్బంది క్రేన్‌తో ఆ చెట్టును తొలగించి సరఫరాను పునరుద్ధ్దరించారు.
కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. నగరంలో చాలాచోట్ల కరెంట్ గంటలకొద్దీ నిలిచిపోయినట్లుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అత్తాపూర్, కాప్రా, ఏఎస్‌రావునగర్, కొత్తపేట మారుతినగర్ ,మలక్‌పేట జడ్జెస్ కాలనీ తదితర ప్రాంతాల్లో కరెంట్ లేదని సోషల్ మీడియాలో వినియోగదారులు మండిపడ్డారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటూ సిబ్బంది ఇచ్చిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ నంబర్లకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా అవి పనిచేయడం లేదని, తమ ఏరియా సిబ్బందిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా స్పందించలేదని పలు ప్రాంతాల నుంచి స్థానికులు పేర్కొన్నారు. అయితే సరఫరా నిలిచిపోయిన ఫీడర్లలో కొన్నిచోట్ల సిబ్బంది వెంటనే అప్రమత్తమై సరఫరాను పునరుద్ధరించారని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు.డీటీఆర్‌లలో లోపాలను కూడా సరిదిద్దారని సీఎండీ తెలిపారు.
వరద ముప్పు ఉంటే..
గంట వ్యవధిలోనే ఏడు నుంచి ఎనిమిది సెంటిమీటర్ల వర్షపాతం నమోదవడంతో చాలాచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. లక్డికాపూల్, ఖైరతాబాద్ తదితరప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందితో పాటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మాట్లాడి వరదముప్పు లేకుండా తీసుకోవలసిన చర్యలను సూచించారు. వరదలో చిక్కుకున్న కార్లను, ద్విచక్రవాహనాలను డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే వెంటనే హైడ్రా కంట్రోల్‌రూమ్ 9000113667 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు.
ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయి..
మూడు గంటలు వర్షం కురిస్తే మరో ఆరు గంటలు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. అమీర్‌పేట, బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు మెహదీపట్నం, ఎన్ఎండీసీ చౌరస్తా, మలక్‌పేట, చాదర్‌ఘాట్, షేక్‌పేట ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్-తార్నాక, తిరుమలగిరి, గండిమైసమ్మ-బాచుపల్లి ఏరియాల్లో కిలోమీటర్ల కొద్దీ వాహన రద్దీ నెలకొంది.
మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలితో సహా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. లక్డీకపూల్ నుంచి మాసబ్ ట్యాక్ వరకు రోడ్లపై వరద భారీగా ప్రవహించడంతో ట్రాఫిక్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. నిమ్స్ వెనుకవైపున రోడ్డుపై భారీ వృక్షం కూలడంతో వాహనదారులకు ప్రమాదం తృటిలో తప్పింది. కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా సెంటర్, ఏఎంబీ మాల్, ఇనార్బిట్ మాల్, కొండాపూర్ ప్రాంతాల్లోని రోడ్డుపై కదలని పరిస్థితి ఏర్పడింది. అటు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు స్తంభించిపోయింది.
చెరువులుగా లోతట్టు ప్రాంతాలు..
రహదారులపై మోకాలు లోతులో నీరు ప్రవహించింది. జూబ్లీహిల్స్ శ్రీనివాస్ నగర్ వెస్ట్ ప్రాంతంలో రోడ్లు చెరువులుగా మారిపోయి ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. లక్డీకాపూల్ జంక్షన్ వద్ద నాలా మరమ్మతుల కోసం తీసిన గుంతల్లో భారీగా నీరు చేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంతంలో చెరువును తలపించేలా వరద చేరింది. అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్ ప్రాంగణంలోకి వరద చేరి వాహనాలన్నీ మునిగిపోయాయి. క్లాంప్లెక్స్ నుంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఎల్లారెడ్డి గూడ, కృష్ణకాంత్ పార్క్, మధుర నగర్, చర్చ్ రోడ్డు, వెంగల్రావు నగర్, ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్‌పేట్, మైత్రీవనంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ పక్కనే ఉండే నాలాలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎస్ఆర్నగర్ నుంచి మొదలుకుని, ధరమ్ కరమ్ రోడ్డు, శివబాగ్ రోడ్డు, అమీర్‌పేట మెట్రో స్టేషన్ ప్రాంతాలన్నీ భారీగా వరద నీరు చేరింది.
సైబరాబాద్‌లో తప్పని ట్రాఫిక్ నరకం
కుండపోత వానకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వర్షంలో గంటల తరబడి రోడ్లపైన ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వరకు, ఇనార్బిట్ మాల్ వరకు, శిల్పాలే ఔట్, ఏఎంబీ, కొత్తగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో దాదాపు 3గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోకి..
మైత్రీవనంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోకి చుట్టు పక్కల నుంచి భారీ వరద పోటెత్తడంతో నిమిషాల వ్యవధిలోనే నీటి మునిగింది.
కిక్కిరిసిన మెట్రో..
నగరంలో ఐటీ కారిడార్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానతో భారీగా ట్రాఫిక్ జామైంది. దీంతో వాహనదారులు సొంత వాహనాల కంటే గమ్య స్థానాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించారు.
కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా..
ఈ సీజన్లో ఇప్పటి వరకు కురిసిన వర్షపాతంలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతంగా అధికారులు తెలిపారు. రాత్రి 9గంటల వరకు నగరంలోని కుత్బుల్లాపూర్ మండలం, మహదేవపురంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 15.1 5సెం.మీలు, బంజారాహిల్స్‌లో 12.45సెం.మీల వర్షపా తం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.