రంగారెడ్డి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకోసం ప్రధానమైన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రైతులు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా భూసేకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. రైతుల అభ్యంతరాలపై ఏప్రిల్ 3 నుంచి విచారణ చేపట్టి వారితో చర్చించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ జరిపిన తర్వాత కూడా రైతులు భూమి ఇచ్చేందుకు ముందుకు రాకపోతే వారికి నోటీసులిచ్చి భూమిని సేకరించాలని నిర్ణయించారు.
జిల్లాలోని మీర్ఖాన్పేట సమీపంలో ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఫ్యూచర్‌సిటీకి ప్రధానమైన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును 330 అడుగుల వెడల్పుతో సుమారు 42 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించింది. ఫేస్-1లో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు సుమారు 19 కిలోమీటర్లు వేయనున్నారు. ఫేస్-2లో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర 300 అడుగుల వెడల్పుతో వేయనున్నారు.
అందుకోసం 449 ఎకరాలను గుర్తించారు. ఫేస్-1, ఫేస్-2 రోడ్డు నిర్మాణంతో 4,725 మంది తమ భూములను కోల్పోనున్నారు. కాగా భూసేకరణ విషయంలో రైతులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రభుత్వం పోలీసుల సహకారంతో భూములను సేకరించడంతోపాటు హద్దురాళ్లను ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నా..ప్రభుత్వం మాత్రం ముందుకే సాగుతున్నది.
మొదటి విడతలో ఫేస్-1 భూసేకరణపై..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకోసం మొదటి విడుతలో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి కొంగరకుర్దు, ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ మీదుగా మీర్ఖాన్పేట వరకు భూసేకరణపై వచ్చిన అభ్యంతరాలను విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విచారణలో భూసేకరణకు రైతులను ఒప్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులను ఒప్పించి పరిహారం విషయంలో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.
కాగా, రైతులు భూమికి భూమి ఇవ్వాలని లేదా మార్కెట్‌ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులు ఏ డిమాండ్‌ను అంగీకరిస్తారనేది తేలాల్సి ఉన్నది. అలాగే, ఫేస్-2లో మీర్ఖాన్పేట నుంచి కుర్మిద్ద, ఆకులమైలారం, మీర్ఖాన్పేట, కడ్తాల్, ఆమనగల్లు మీదుగా ఆకుతోటపల్లి వరకు భూమిని సేకరించనున్నా రు. ఫేస్-1లో 14 గ్రామాల నుంచి రోడ్డు వెళ్లనున్నది.
పరిహారం తేల్చకుండానే టెండర్లు..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయాన్ని తేల్చకుండానే టెండర్ల కోసం అధికారులు దరఖాస్తులు కోరారు. నష్టపరిహారం విషయాన్ని తేల్చకుండానే టెండర్లను ఆహ్వానించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతులు ఎన్ని అభ్యంతరాలు సృష్టించినా ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం వెయ్యి ఎకరాలను సేకరించడమే ధ్యేయంగా పెట్టుకున్నది.
రైతుల అభిప్రాయాలు, డిమాండ్లు తెలుసుకుంటాం
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణలో వచ్చిన అభ్యంతరాలపై వచ్చే నెల మూడో తేదీ నుంచి విచారణ జరుపుతాం. ముందుగా ఫేస్-1 తర్వాత ఫేస్-2లో వచ్చిన అభ్యంతరాలను రైతులతో చర్చించి వారి అభిప్రాయాలు, డిమాండ్లను తెలుసుకుని.. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం.
-రాజు, భూసేకరణ అధికారి, రంగారెడ్డి జిల్లా