వికారాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఒకవేళ ఎక్కడైనా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడినట్లు సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి చికిత్స అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వ్యాధుల వ్యాప్తి కారకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈగలు, అపరిశుభ్రత, నిల్వ నీరు, మురుగునీరు, దోమకాటుతో అతిసార, కామెర్లు, టైఫాయిడ్, మలేరియా, కలరా డెంగీ తదితర వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ప్రమాదకరమైన డెంగీ కేసులు కూడా నమోదైన దృష్ట్యా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గతంలో డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను కూడా నిర్వహించే దిశగా ముందుకెళ్తున్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధుల కేసులు పెరిగినట్లయితే జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించి వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాలున్నవారి వివరాలను సేకరించనున్నారు. ఆయా వ్యాధి లక్షణాలను బట్టి నేరుగా ఇంటి వద్దనే ఉచితంగా మందులను అందించనున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి లక్షణాలు మూడు, నాలుగు రోజులైనా తగ్గకపోయినట్లయితే సంబంధిత వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపనున్నారు.
డెంగీ, మలేరియా నిర్ధారణ అయితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందించనున్నారు. డెంగీ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లోని ఇండ్లలో ప్రత్యేక సర్వే చేపట్టి డెంగీ లక్షణాలున్నట్లయితే రక్త నమూనాలను సేకరించి అవసరమైన చికిత్స అందించనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లోనూ డెంగీ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో డయేరియాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా వానకాలంలో నీరు కలుషితం కావడంతోనే డయేరియా వచ్చే ప్రమాదమున్న దృష్ట్యా అవగాహన కల్పించడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లను అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.
వాతావరణం చల్లబడడంతోపాటు ప్రతి రోజూ ఓ మోస్తరు నుంచి ముసురు కురుస్తున్నది. దీంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలున్నాయి. ఇప్పటికే చలి, జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. టైఫాయిడ్ జ్వరాలతో మొదలై సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉండడంతో ఆదిలోనే అరికట్టేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా వర్షాలు పడుతుండడంతో నీటి కాలుష్యం పెరగడంతోపాటు డ్రైనేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా, కామెర్లు వచ్చే అవకాశమున్నది. అందుకోసం శుభ్రమైన, కాచి వడపోచిన నీటినే తీసుకోవాలి. వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు నీటితో దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకోవడంతోపాటు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తినేముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. వేడి, వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి, ఆహార పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాం. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. డెంగీ కేసులు నమోదైతే సంబంధిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను కూడా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఇండ్లలో, ప్రభుత్వ సంస్థల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
– డాక్టర్ పల్వన్‌కుమార్, వికారాబాద్ డీఎంహెచ్‌వో