షాద్నగర్ టౌన్, మే 04 : వేసవికాలం వచ్చిందంటే చాలు తాటిముంజలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసిన తాటిముంజల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వేసవి కాలంలో షాద్నగర్ పట్టణంలో విక్రయించే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, శీతలపానీయాలకు దీటుగా తాటిముంజల విక్రయాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే మాసాల్లోనే అందుబాటులో ఉండే తాటిముంజలను ప్రజలను కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తాటిముంజలను తినేందుకు ఇష్టపడుతారు. ఆరోగ్యానికి మేలు చేసే తాటిముంజలకు వేసవికాలంలో ఎక్కడ లేని విధంగా భారీ డిమాండ్ ఉంటుంది.
షాద్నగర్ పట్టణంలోని రహదారుల్లో తాళ్ల అంతారం, కల్వకుర్తి, ఆమనగల్లు, ఇతర ప్రాంతాల నుంచి తాటిముంజలను తీసుకొచ్చి విక్రయిసున్నారు. సుమారు 20-40 మంది చిరు వ్యాపారస్తులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఈ తాటిముంజల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కాయలో ఒకటి నుంచి ఐదు వరకు తాటిముంజలు ఉంటాయి. డజన్ తాటిముంజలను రూ. 100కు విక్రయిస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. అదే విధంగా తాజాగా ఉన్న తాటిముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వేసవికాలంలో తాటిముంజలు తినడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.