రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని కొహెడలో రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూములను కాసేసేందుకు సీఎం రేవంత్, ఆయన అనుయాయులు యత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొహెడలోని పండ్ల మార్కెట్ పరిరక్షణ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
దళారుల దందాకోసం కొహెడ పండ్ల మా ర్కెట్ భూములను విక్రయించేందుకు సీఎం సిద్ధపడ్డారని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొహెడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, పూలు, ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు 200 ఎకరాల భూములను కేటాయించిందని.. వాటి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందన్నారు. ఈ భూములను తన అనుయాయులకు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను టీజీఐఐసీకి కాంగ్రెస్ ప్రభుత్వం బదలాయించి.. కోర్టు వివాదంలో ఉన్న స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
కొహెడలో వెంటనే ఫ్రూట్‌మార్కెట్ పనులను ప్రారంభించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్పార్టీ రాజకీయాల కోసం కొహెడకు రాలేదని, రైతుల హక్కులను పరిరక్షించేందుకే వచ్చిందన్నారు. లక్షలాది మంది రైతుల కోసం ముఖ్యమంత్రి ఆలోచించకుండా నలుగురైదుగురు దళారుల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌తో గతంలో ఎదురైన ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యల నుంచి మార్కెట్‌ను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొహెడలో 200 ఎకరాల్లో నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నా రు.
అప్పుడు తాను మార్కెటింగ్‌శాఖ మంత్రిగా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన తో కొట్లాది మరీ రూ. 10 కోట్లు ఫ్రూట్ మార్కెట్ కోసం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పండ్ల మార్కె ట్ భూసేకరణ సమయంలో రైతులకు పరిహారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.17 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే, మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్ల కూడా కేటాయించిందన్నా రు. 2020లో జీవో 11 ద్వారా ఈ మార్కెట్‌ను నోటిఫై కూడా చేశామని, జీవో 2016 ప్రకారం రూ. 350 కోట్లను బ్యాంకులో జమ చేశామన్నారు. రాబోయే వం దేండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మార్కెట్‌కు రూపకల్పన చేశామన్నారు. భూమితోపాటు సరిపడా డబ్బున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మార్కెట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకోకపోగా…ఈ భూమిని అమ్మాలని చూస్తున్నదని మండిపడ్డారు.

Harishrao
నాదర్గుల్ భూములు ప్రభుత్వానివే..
నాదర్గుల్లోని 373 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కొహెడలో పండ్ల మార్కెట్ స్థల పరిశీలనకు హాజరైన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నాదర్గుల్ గ్రామంలో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని.. సర్కార్ అండదండలతో కాజేసేందుకు రోజుకో సంస్థ తెరపైకి వస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూశాఖమంత్రి ఆయన కుమారుడిని అడ్డంపెట్టి ఈ భూమిని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
ఈ భూమి ప్రభుత్వానిదేనని రంగారెడ్డి కలెక్టర్, కందుకూరు ఆర్డీవో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని, అయినా ఈ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని.. అడ్డొచ్చిని రైతులను విచక్షణారహితంగా కిరాయి మూకలు కొడు తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, పోలీసులు కూడా రైతులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. నాదర్గుల్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు.
రేవంత్‌రెడ్డి.. భూముల చుట్టూ తిరుగుతున్నాడు..
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. భూముల చుట్టూ సీఎం రేవంత్ తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములతోపాటు మార్కెట్లో విలువైన స్థలాలనూ కొల్లగొట్టే యత్నం చేస్తున్నది. ఇటీవలే నాదర్గుల్లో రూ.7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచుకునేందుకు సీఎం, మంత్రులు యత్నించారు. అలాగే, కొహెడలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెట్‌ను నిర్మించేందుకు 200 ఎకరాల భూమిని కేటాయించగా.. కాంగ్రెస్ సర్కార్ ఫ్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేయకుండా ఆ భూమిని టీజీఐఐసీకి అప్పగించగా.. రేవంత్‌రెడ్డి ఆ భూములను తన అనుయాయులకు కట్టబెట్టేందుకు బరితెగించారు. పండ్ల మార్కెట్ నిర్మాణానికి కోర్టు వివాదంలో ఉన్న భూములను కేటాయించారు. ముఖ్యమంత్రికి ఇక్కడ పండ్ల మార్కెట్‌ను నిర్మించే ఉద్దేశమే లేనట్లుంది. ఎక్కడ భూమి ఉన్నా..ఆయన వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదు. కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేవరకూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటుంది. -సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
రైతుల కంటే వ్యాపారులే ముఖ్యమా?
రైతుల ప్రయోజనాల కంటే వ్యాపారులు, మధ్యదళారుల ప్రయోజనాలే ము ఖ్యమా అని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కోసం అనువైన భూములను కేటాయిస్తే. ఆ భూములను కాకుండా వివాదాల్లో ఉన్న భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూముల జోలికి వెళ్లొద్దని.. ఆ భూములను ఇతరులకు కేటాయించొద్దని హైకోర్టు ఆదేశాలున్నా మార్కెట్‌కు ఎలా కేటాయిస్తారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కమీషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూములను కాజేసే యత్నం చేస్తున్నారని.. అందులో భాగంగానే మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భూములను కాజేసేందు కు పెద్ద స్కెచ్ వేశారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్నారు. కమీషన్లు ఇస్తేనే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి జోక్యం చేసుకుని సీఎంను ఒప్పించి కొహెడలోనే పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని, లేని పక్షం లో బీఆర్ఎస్పార్టీ ఆందోళన తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
టీజీఐఐసీకి కేటాయించడం వెనుక మర్మమేమిటి?
గత ప్రభుత్వం కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు 200 ఎకరాలను సేకరించి మార్కెటింగ్‌శాఖకు అప్పగిస్తే.. ఆ భూములను కాంగ్రెస్ ప్రభు త్వం టీజీఐఐసీకి అప్పగించటం వెనుక ఆంతర్యమేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, దండెం రాంరెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు రైతులకు సంఘీభావం తెలుపనున్న హరీశ్‌రావు
పరిగి, ఏప్రిల్ 6 : ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మంగళ వారం సంఘీభావం తెలపనున్నారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.
ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి రైతులను కలిసి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇటీవల మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సైతం పూర్తి మద్దతునిచ్చారు. మంగళవారం ఉదయం మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులను కలిసి సంఘీభావం తెలపనున్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, పరిగి, వికారాబాద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, నరేందర్‌రెడ్డి పాల్గొననున్నారు. కాళ్లాపూర్, రాపోల్, దోమ మండలంలోని బట్లచందారం, కొండాయిపల్లి, అనంత్రెడ్డిపల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొననున్నారు.
టీజీఐఐసీని అడ్డం పెట్టుకుని భూములు కాజేయాలని కుట్ర
కొహెడలో పండ్ల మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల స్థలానికి ప్రస్తుత మార్కెట్లో రూ.3,000 కోట్ల వరకు వస్తుంది. అందుకే ప్రభుత్వం టీజీఐఐసీని అడ్డం పెట్టుకుని ఆ భూములను కాజేయాలని యత్నిస్తున్నది. కొహెడలో సర్వేనంబర్ 548, 507లో 172 ఎకరాల భూమిని పండ్ల మార్కెట్ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలో ఉన్న 148 మం ది రైతులకు రూ.17 కోట్ల పరిహారాన్ని కూ డా చెల్లించింది. రేవంత్ సర్కార్ వచ్చి 28 నెలలు దాటినా మార్కెట్ పనులను చేపట్టకపోగా.. ఈ భూములను సీఎం తన అనుయాయులకు కట్టబెట్టేందుకు యత్నించడం దారుణం. కాంగ్రెస్ నాయకుల కుట్రలను తిప్పికొడతాం. పండ్ల మార్కెట్‌ను ఇక్కడే నిర్మించాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రతరం చేస్తాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేస్తాం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి నియోజకవర్గంలోని భూములను కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. కొహెడ పండ్ల మార్కెట్‌కు కేటాయించిన భూములను కూడా కాజేయాలని ఇటీవల నగరంలోని ఓ హోటల్లో రహస్య మంతనాలు కూడా జరిపినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొహెడలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయించడంతోపాటు నిధులు కూడా ఇచ్చారు. ఆ భూములు, నిధులను కాజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తిప్పికొట్టి రైతులకు న్యాయం చేస్తాం.
– సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే