తాండూరు, సెప్టెంబర్ 27: తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, నాణ్యమైన విద్య, వైద్యం, అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సంక్షోభం కనిపిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలో రూ.58.23 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మాతా శిశు ఆస్పత్రిలో దుకాణాల సముదాయాలను ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ-కర్ణాటక రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉందన్నారు.
ఒక అడుగు ఇటు తెలంగాణలో వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, మండు వేసవిలోనూ పొలాల్లో పారుతున్న నీళ్లు కనిపిస్తాయన్నారు. వ్యవసాయానికి పెట్టుబడికి సాయం, ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే రూ.5 లక్షల బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగునీటికి కొదువలేదన్నారు. మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి, కేసీఆర్ కిట్, గృహలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలు అమలవుతున్నాయన్నారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఆసరా పింఛన్లు, గ్రామజ్యోతి, గొర్రెల పంపిణీ, చేనేత లక్ష్మి, నేతన్న బీమా, దళితబంధు ఇస్తున్నట్లు తెలిపారు.
సరిహద్దు పల్లెల వద్ద ఒక అడుగు కర్ణాటక వైపు వేస్తే ఎప్పుడొస్తదో తెలువని కరెంట్… ఎండిన పొలాలే కనిపిస్తాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేద రైతుల చేతిలో డబ్బు లేక సరైన పంటలు పండించని కష్టాలు, రైతు మరణిస్తే ఎలాంటి సాయం అందని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయంతో పాటు పల్లెలో తాగు నీటి ఇక్కట్లు. ఈడొచ్చిన కూతురి పెండ్లి కోసం డబ్బులు లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఉన్నారన్నారు. గర్భిణులు, బాలింతలకు సరైన సౌకర్యాలు లేక పురుట్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పసిపిల్లలతో పాటు చదువుకున్న వారికి ఉపాధి లేక, వెనుకబడిన కులాల వారికి సాయం అందించక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నదన్నారు. అందుకు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను, కీడు చేసే బీజేపీని నమ్మరాదని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. కొత్తకొత్త ప్రజారోగ్య పథకాలతో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
త్వరలో ఉద్యోగులకు పీఆర్సీ పెంచుతున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ, ఆశవర్కర్లకు జీతాలు మరింత పెంచుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాలకంటే తెలంగాణలో జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు, తాండూరు కాగ్నానది మరమత్తులకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. తాండూరు జిల్లా ఆసుపత్రికి మరో సీటీ స్కానింగ్‌తో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోరిక మేరకు రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నామని, దీంతో ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. రెండోసారి రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యే, మూడోసారి మహేందర్‌రెడ్డి మంత్రి కావడం ఖాయమన్నారు. అందుకు తాండూరు ప్రజలు అత్యధిక మెజార్టీతో రోహిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
బహిరంగ సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ, వైస్ చైర్మన్ ఉమాశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్‌రెడ్డి, పురుషోత్తంరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని బీఆర్ఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వేల కోట్ల నిధులతో తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నానని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి తెలిపారు. తాండూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానల నిర్మాణాలతో తాండూరు విస్తరణ పుంజుకున్నదని తెలిపారు. రోడ్లు, ఆనకట్టలతో పాటు పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుతుందన్నారు. తాండూరుపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి ప్రేమానురాగాలు చూపడంతో అన్నివిధాలుగా అభివృద్ధి సాధిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు మరిన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మంత్రి మహేందర్‌రెడ్డి సహకారంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు పూర్తి చేసి పలు నూతన పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతున్నదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి 50 వేలకు పైగా మైజార్టీ సాధిస్తామన్నారు. ఇంతవరకు జరిగిన వేల కోట్ల అభివృద్ధి పనులతో పాటు తాజాగా రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.10 కోట్లతో వ్యవసాయ మార్కెట్, రూ.10.60 కోట్లతో బషీరాబాద్‌లో 30 పడకల ఆసుపత్రి, రూ.10.23 కోట్లతో కందనెల్లి, జినుగూర్తి, చంద్రవంచ, జుంటుపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్లు, రూ.1.35 కోట్లతో తాండూరులో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. వీటితో పాటు తాండూరుకు మరిన్ని అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు రానున్నట్లు తెలిపారు. అడిగిన వెంటనే కోట్‌పల్లి ప్రాజుక్టుకు, తాండూరు కాగ్నానది మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
పేద విద్యార్థులకు నర్సింగ్ కళాశాల వరమని సమాచార, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరుకు వేల కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేశామన్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొస్తానని తెలిపారు. తాండూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. తాండూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుటుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని సూచించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలయిక తాండూరుకు వరం అన్నారు. ఇరువురి కలయికతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు మొదలై ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందుకు రావాడం లేదన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి రోహిత్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లాకు పుష్కలంగా సాగునీరు రానున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. తాండూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వల్లె గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని సూచించారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు.
తాండూరు, సెప్టెంబర్ 27: తాండూరు పట్టంతో పాటు నియోజకవర్గంలోని పల్లెల్లో బీఆర్ఎస్ జోష్ నెలకొన్నది. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రగతి ప్రస్థాన సభ విజయవంతమైంది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృషి ఫలించింది. సభకు అంచనాకు మించి ప్రజలు తరలివచ్చారు. బ్యాండు, డప్పులతో ప్రజలు జై తెలంగాణ…జైజై బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు.
సభకు విచ్చేసిన మంత్రులు హరీశ్‌రావుకు, మహేందర్‌రెడ్డికి జనం నీరాజనం పలికారు. జనమా…ప్రభంజనమా అన్న మాదిరిగా కొనసాగిన సభకు దండు కదిలింది. దారులన్ని సభవైపే సాగాయి. అశేషంగా తరలివచ్చిన ప్రజలతో రోడ్లన్ని కిక్కిరసి పోయాయి. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మహిళలు, వృద్దులు, రైతులు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తాండూరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు త్వరలో ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇవ్వడంతో నేతలతో పాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సభ సక్సెస్ చేసినందుకు పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.