రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణులపై కొనసాగుతున్న నిర్బంధంపై జిల్లాలో పలుచోట్ల నిరసన వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బా ట కార్యక్రమాన్నీ అడ్డుకుంటుండడంతో పలు చోట్ల పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కేసుల పరంపర కొనసాగుతున్న ది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకులాల బాటలో భాగంగా ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ పరిధిలోని పలు గురుకులాలకెళ్లి విద్యార్థుల సమస్యలు, వారికి అందుతున్న భోజనం, సౌకర్యాలు తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది మింగుడు పడని ప్రభుత్వం ఆయనపై అక్రమంగా కేసులు బనాయించింది. అలాగే, షాద్‌నగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్తోపాటు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన గురుకులాల బాటపైనా ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధం విధించింది. ప్రిన్సిపాళ్ల అనుమతుల్లేకుండా ఎవరూ హాస్టళ్లలోకి వెళ్లొద్దని, ప్రిన్సిపాళ్ల ఎదుటే విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకోవాలని నిబంధన విధించింది. దీంతో విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అరెస్టుపై బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు.. అలాగే, అంబేద్కర్ చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. హరీశ్‌రావు అరెస్టు అక్రమమన్నారు. చిల్లర రాజకీయాలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. నిరసనలో బీఆర్ఎస్వీ నాయకులు రాజ్తార్, వినయ్, ప్రసాద్; వేణు, హరీశ్, అరున్, వంశీ, అశోక్, రాకేశ్ తదితరులున్నారు.
గురుకులాలు అధ్వానంగా మారాయి. సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేశాయి. విద్యా ర్థులకు సరైన ఆహారం అందడం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గాలేదు. సౌకర్యాలు అంతంతే ఉన్నాయి. వాటిని ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గురుకులాల్లో పర్యటిస్తుంటే.. గురుకులాల్లోని సమస్యలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధ కాండ సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైనది.
– రాజ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి