వికారాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురువడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా బంట్వారం, మోమిన్‌పేట, మర్పల్లి, నవాబుపేట, కడ్తాల్, కొత్తూరు మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉన్నది. దెబ్బతిన్న పంటలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 355 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అత్యధికంగా బంట్వారం మండలంలో 89 మంది రైతులకు చెందిన 155 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మోమిన్‌పేట మండలం రాంనాథ్గుడ్పల్లి సమీపంలో కోళ్లఫారం నేలమట్టమైంది. మోమిన్‌పేట మండలంలో 9 సెం.మీ, బంట్వారం మండలంలో 8.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రెండు నెలల్లో రెండోసారి జిల్లాలోని ఆయా పంటలను వడగండ్ల వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 355 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. బంట్వారం, మోమిన్‌పేట్, మర్పల్లి, నవాబుపేట్ మండలాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 245 మంది రైతులు 355 ఎకరాల్లో ఆయా పంటలను నష్టపోగా, వ్యవసాయ పంటలకు సంబంధించి 127 మంది రైతులకు చెందిన 190 ఎకరాలు, ఉద్యానవన పంటలకు సంబంధించి 118 మంది రైతులకు చెందిన 165 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
అత్యధికంగా బంట్వారం మండలంలో 89 మంది రైతులకు సంబంధించి 155 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు నష్టపోయారు. మర్పల్లి మండలంలో 72 మంది రైతులకు చెందిన 93 ఎకరాలు, మోమిన్‌పేట్ మండలంలో 74 మంది రైతులకు సంబంధించిన 95 ఎకరాలు, నవాబుపేట మండలంలో 10 మంది రైతులకు 12 ఎకరాల్లో ఆయా పంటలను నష్టపోయినట్లు వ్యవసాయ, ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదికను అందజేశారు. మోమిన్‌పేట మండలం రాంనాథ్గుడుపల్లి సమీపంలో తిరుపతి వెంకటేశానికి సంబంధించిన కోళ్లఫారం నేలమట్టమైంది. దాదాపు రూ.50 లక్షలు నష్టపోయినట్లు రైతు కన్నీరుమున్నీరయ్యాడు.
మూడు మండలాల్లో కుంభవృష్టి..
జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని మోమిన్‌పేట, బంట్వారం, మర్పల్లి మండలాల్లో వడగండ్ల బీభత్సంతో కుంభవృష్టిలా వర్షం కురిసింది. సంబంధిత మూడు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బలమైన ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. జిల్లాలోని మోమిన్‌పేట మండలంలో అత్యధికంగా 9 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, బంట్వారం మండలంలో 8.4 సెం.మీటర్ల వర్షపాతం, మర్పల్లి మండలంలో 7 సెం.మీటర్ల వర్షపాతం, తాండూరు మండలంలో 5.2 సెం.మీటర్లు, యాలాల మండలంలో 4.8 సెం.మీటర్లు, పూడూరు మండలంలో 3.9 సెం.మీటర్లు, పెద్దేముల్ మండలంలో 3.6 సెం.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 3.5 సెం.మీటర్లు, ధారూరు మండలంలో 3.3 సెం.మీటర్లు, నవాబుపేట్ మండలంలో 2.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 1-2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
మోమిన్‌పేట మండలంలో..
మోమిన్‌పేట, ఏప్రిల్ 26 : మండలంలోని ఎన్కతల, టేకులపల్లి, మొరంగపల్లి, రాంనాథ్గుడుపల్లి, సైయ్యదాలీపూర్ తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కూరగాయ పంటలు, బొప్పాయి, మిరప, టమాట, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వెల్లుల్లి పంట తడిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, పశువుల షెడ్లు నేలకొరిగాయి. రానాథ్గుడుపల్లిలో వెంటేశం, ఎన్కతల గ్రామంలో బోడ్డు మురళీమోహన్రెడ్డిలకు చెందిన పౌల్ట్రీ ఫామ్‌లు పూర్తిగా ధ్వంసమై వందల కోళ్లు మృతి చెందాయి. మోమిన్‌పేట మండలంలో బుధవారం జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, మండల వ్యవసాయాధికారి జయశంకర్ మొరంగపల్లి గ్రామంలో పంట నష్టం వివరాలను పరిశీలించారు.
బంట్వారం మండలంలో..
బంట్వారం, ఏప్రిల్ 26 : మండలంలోని తొరుమామిడి, బొపునారం, బంట్వారం, మాలసోమారం, సుల్తాన్పూర్, రొంపల్లి, సల్బత్తాపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, బొప్పాయి, మామిడి తదితర పంటలకు నష్టం జరిగింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, పలు చోట్ల వైర్లు తెగిపడ్డాయి. ఇండ్ల మధ్య చెట్లు కూలాయి. సుల్తాన్పూర్, సల్బత్తాపూర్ ఆర్అండ్బీ రోడ్డు పక్కన చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలువురి ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. మాలసోమారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం వద్ద ఉన్న బోర్డులు గాలికి పడిపోగా, వైకుంఠధామం పైకప్పు లేచిపోయింది.
అకాల వర్షంతో మండలంలో అపార నష్టం సంభవించింది. ఎస్బీపల్లిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వర్షం కురిసింది. ఈ వర్షానికి 39.08 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు.
‘పంట నష్టం వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేస్తాం’
అకాల వర్షాలకు పంట నష్టం వివరాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు వివరిస్తామని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత తెలిపారు. బుధవారం ఎస్బీపల్లిలో సర్పంచ్ అంబటి ప్రభాకర్‌తో కలిసి ఆమె పంటలను పరిశీలించారు. ఆమె వెంట షాద్‌నగర్ హార్టికల్చర్ అధికారి ఉషారాణి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి దీపిక, రైతు కోఆర్డినేటర్ అంబటి కృష్ణయ్య ఉన్నారు.
దోమ మండలంలోని దోమ, పాలేపల్లి, అయినాపూర్, బ్రహ్మణపల్లి, దిర్సంపల్లి, బ్రహ్మపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో దోమ, బ్రహ్మణపల్లి మధ్య ఉన్న కాకరవేణి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దోమ మండలంలో 8.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెయిన్ ఫాల్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. మండల పరిధిలోని ఖమ్మం నాచారం గ్రామంలో పిడుగుపడి వెంకటయ్యకు చెందిన పశువులు మృతి చెందాయి. కొండాయిపల్లి గ్రామానికి చెందిన జీనిగి అంజిలప్పకు చెందిన ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది.
కడ్తాల్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఏక్వాయిపల్లి, మర్రిపల్లి, ముద్విన్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీలత, ఏఈవో అభినవ్‌రెడ్డి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో 198 ఎకరాల వరి, 22 ఎకరాల మామిడి, 16 ఎకరాల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
మండలంలోని జంగారెడ్డిపల్లి, నుచ్చుగుట్ట, సాకిబండ, మేడిగడ్డ, మంగళపల్లి, చింతలపల్లి, పోలేపల్లి, కోనాపూర్, రామునుంతల గ్రామాల్లో నష్టపోయిన పంటలను మండల ఏవో అరుణకుమారి పరిశీలించారు. వరి పంట 510 ఎకరాలు, మామిడి 187 ఎకరాల్లో నష్టం జరిగినట్లు తెలిపారు. ఆమె వెంట ఏఈవోలు సాయిరాం, శివతేజ, రాణి, రైతులు జంగారెడ్డి, యాదయ్య, దేవేందర్, సక్రు, పాండు ఉన్నారు.
పిడుగుపాటుకు కాడెద్దులు మృతి
యాలాల, ఏప్రిల్ 26 : మండలంలోని అక్కంపల్లి గ్రామంలో కావలి అశోక్‌కు చెందిన రెండు కాడెద్దుల పక్కన పిడుగు పడడంతో మృత్యువాత పడ్డాయి.
ఈదురుగాలులు, వడగండ్ల వానకు మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో పాటు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.. బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సిరిపురం గ్రామంలో మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో మహేశ్ ఉన్నారు.
మండలంలోని మద్దూరు, హైతాబాద్, సోలిపేట్, చందనవెళ్లి, మాచన్‌పల్లి, అంతిరెడ్డిగూడ, మన్మర్రి తదితర గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయాధికారి వెంకటేశం నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో రాఘవేందర్, రైతులు ఉన్నారు.అబ్దు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో తీవ్ర పంట నష్టం
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 26 : మండలంలో అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో దాదాపు 150 ఎకరాల్లో పంట నష్టం జరుగగా బుధవారం మండల వ్యవసాయ అధికారి కవిత పరిశీలించారు. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు కిందపడ్డాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మజీద్‌పూర్ గ్రామంలో సర్పంచ్ సుధాకర్‌రెడ్డి అధికారులతో కలిసి పంటలను పరిశీలించారు.