Cyber Crime | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): నగరంలో రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు కనీసం 10 సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యుల కంటే కూడా ఎక్కువగా మోసపోతున్న వారిలో ఉన్నత చదువులు చదివినవారు, సంపన్నలే అధికంగా ఉండటం గమనార్హం. ఏ కేసును పరిశీలించి చూసినా బాధితుల ఖాతాల్లో నుంచి లక్షలు, కోట్ల రూపాయలే సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి మళ్లినట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో మధ్యస్థాయి వారు. వీరు ఎక్కువగా జాబ్ ఫ్రాడ్, క్రిప్టో కరెన్సీ వంటి ఆన్లైన్ పెట్టుబడులు, స్టాక్ ఎక్సేంజ్ వంటి వాటిన పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు..
జాబ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడులు, స్టాక్ ఎక్సేంజ్ ముసుగులో పెట్టుబడులు, తక్కువ సమయంలో రెట్టింపు రాబడి, ఫర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో.. అందమైన అమ్మాయిలను ఎరగా చూపించి డేటింగ్ ముసుగులో.. ఆకర్షనీయ ప్రకటనలతో.. మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి.. తక్కువ పెట్టబడి పెట్టి, అనతికాలంలోనే రెట్టింపు రాబడి పొందండి.. పెట్టుబడిపై సంవత్సరానికి 30 శాతం రాబడి ఇస్తాం.. ఒక్కసారి చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టి చూడండి..జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా..మీరు ఇంటివద్దనే ఉండి నెలకు లక్షలు సంపాదించవచ్చు..ఎలాంటి పెట్టుబడి లేకుండా, కష్టపడకుండా కూర్చున్న చోట నుంచే డబ్బు సంపాదించే మార్గం..
నా వయస్సు 20 సంవత్సరాలు, ఫిమేల్… నేను సింగిల్…. మంచి స్నేహితుడి కోసం చూస్తున్నాను.. మీకు దుబాయ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ వచ్చింది….దానికి సంబంధించిన కస్ట్‌మ్స్ ఫీజు చెల్లిస్తే గిఫ్ట్ మీ ఇంటికి చేరుతుంది.. ఇలా రకరకాల ఆకర్షనీయమైన, మాయమాటలతో కూడిన ప్రకటనలు, వాట్సాప్‌లలో వచ్చే లింక్కులు, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా పరిచయాలతో ఎంతో మంది అమాయక జనం సైబర్ నేరాల బారిన పడుతున్నట్లు సైబర్‌క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సైబర్‌నేరాలపై ఎంత అవగాహన కల్పించిన చాలా మంది ప్రజల్లో మార్పు రావడం లేదని వాపోతున్నారు.
1930 నంబర్‌కు కాల్ చేయండి: సైబర్‌క్రైమ్ పోలీసులు
ప్రజలు పెట్టుబడులు పెట్టేముందు లేదా కొత్తగా పరిచయమైన వారితో ఆర్థిక లావాదేవీలను పంచుకునే మందు ఒక్కసారి ఆలోచించాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడికి అనతికాలంలోనే అత్యధిక రాబడి ఇస్తామని చెప్పే ప్రకటనలు, మాటలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. వంద రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరంలోపే రెండు వందల రూపాలయల రాబడి ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించడంతో పాటు ప్రకటనలతో మాయమాటలు చెప్పే వారిని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. డబ్బులు ఎవరికీ సులువగా రావని, కష్టపడనిదే ఆదాయం రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురై, డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్‌కు కాల్చేసి, ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.