నెర్రులు బారిన పంటను చూసి రైతన్న కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెంపులేకుండా కరెంట్.. పుష్కలంగా సాగునీరు ఉండడంతో ఎవుసం సాఫీగా సాగింది.. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరువును తెచ్చింది.. జలధార వెనుకపట్టు పట్టింది.. బోరుబావుల్లో ఊట తగ్గింది.. కరెంటు అయినా పొద్దంతా వస్తే వరుస తడులతోనైనా పంటకు నీరు పెడుదామంటే కరెంట్ కోతలతో నాలుగు ఎకరాలు పారే బోరుబావి అర ఎకరం కూడా పారడం లేదు.. ఎంత కష్టమొచ్చే దెవుడా.. అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మంచాల, మార్చి 3 : అడుగంటుతున్న భూగర్భజలాలు.. విద్యుత్తు కోతలతో వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. బోరుబావుల కింద కొద్దిపాటి వరి నాట్లు వేసిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ ఏటా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో బోరుబావుల్లోని నీరు తగ్గి పంటపొలాలు ఎండిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లోని రైతులు ప్రతి యాసంగి సీజన్లోనూ 7500 ఎకరాలకుపైగా వరి పంటను సాగు చేస్తుంటారు. ఈసారి మాత్రం కేవలం 4000 ఎకరాల్లోనే సాగు చేశారు. దీంతో ఒక్కసారిగా వరి పంట సాగు విస్తీర్ణం పడిపోయింది.
గతంలో 500 అడుగుల లోతుకు బోరు వేస్తే వాటర్ వచ్చేవి. ప్రస్తుతం ఈ ఏటా సరిపడా వర్షాలు కురియక పోవడంతో 700-1000 అడుగుల లోతుకు బోరు వేస్తున్నా.. చుక్క నీరు రావడం లేదు. ఇలా గ్రామాల్లో భూగర్భ జలాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. బోరుబావుల్లోనూ నీరు తగ్గుతుండడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఎండలు ముదరక ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో కనీసం పాడిపశువులకైనా నీరు దొరుకుతుందా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 10 గంటలు కూడా రావడంలేదు. వ్యవసాయ బావులకు విద్యుత్తు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఉన్నకొద్ది పాటి నీటిని పంట పొలాలకు పెడుదామంటే కరెంట్ సమస్యతో రైతన్నలు ఇబ్బందిపడుతున్నారు.
మంచాల మండలంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో 7500 ఎకరాలకుపైగా ఉండగా.. ప్రస్తుతం నాలుగు వేల ఎకరాల్లోనే రైతులు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతోనే పంటల సాగును తగ్గించారు. ఈ సమయంలో రైతులను ఆరుతడి పంట వైపు చైతన్యపరుస్తున్నాం.
– జ్యోతిశ్రీ, వ్యవసాయ శాఖ అధికారిణి
బోరుబావులకు విద్యుత్తు సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో విద్యుత్తు సమస్య తలెత్తినట్లు ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరిస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి లోపాలు లేవు.. లో ఓల్టేజీ సమస్యా లేదు.
-సత్యనారాయణ, ఏఈ, మంచాల